న్యూఢిల్లీ: నాగ్‌పూర్‌కు చెందిన ఒక అభ్యర్థికి NEET UG 2026 ఎగ్జామ్ సెంటర్ అబుదాబిలో కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నీట్ రీఎగ్జామ్ నిర్వహణపై తలెత్తిన ప్రశ్నలు, విమర్శలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. NEET UG 2026 పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్షా కేంద్రాలు (Exam City)లో సవరణ చేసుకునే అవకాశం మళ్లీ ఇచ్చారు. దాంతో సుమారు 3.2 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎడిట్ విండోను ఉపయోగించుకున్నారు. వారిలో 99.5 శాతం కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు వారు కోరుకున్న నగరంలోనే ఎగ్జామ్ రాసేలా సెంటర్లు కేటాయించినట్లు ఎన్టీఏ తెలిపింది.
అసలు వివాదం ఏంటీ.. ఎందుకీ విమర్శలు
నీట్ రీఎగ్జామ్ కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోగా, అతనికి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఎగ్జామ్ సెంటర్ అబుదాబిలో వేశారు. ఈ విషయం వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఎగ్జామ్ నిర్వహణపై NTAపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఈ విమర్శలు, ఆరోపణలపై NTA శనివారం (జూన్ 20న) మధ్యాహ్నం స్పందించింది.
అభ్యర్థి లాగిన్ నుండే అబుదాబి ఎంపిక
NTA రికార్డుల ప్రకారం, సంబంధిత అభ్యర్థి విషయంలో ఎగ్జామ్ సిటీని అబుదాబికి మార్చే ప్రక్రియ అభ్యర్థి తన రిజిస్టర్డ్ లాగిన్ ద్వారా కోరారు. సిస్టమ్‌లో నమోదు అయిన దాని ప్రకారం, ఈ మార్పు ఒకే యూజర్ ద్వారా జరిగిందని ఏజెన్సీ తెలిపింది.
చివరి నిమిషంలో నాగ్‌పూర్ కేంద్రం కోసం డిమాండ్
నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహణకు కేవలం 48 గంటల ముందు, జూన్ 19 సాయంత్రం అబుదాబి నుంచి నాగ్‌పూర్‌కు ఎగ్జామ్ సెంటర్ మార్చాలని అనధికారికంగా అభ్యర్థన అందినట్లు ఎన్టీఏ తెలిపింది. అదే సాయంత్రం అభ్యర్థి తండ్రిని సంప్రదించి, వారి కోరిక మేరకు నాగ్‌పూర్‌లో సెంటర్ వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మూడుసార్లు కనిపించిన అబుదాబి కేంద్రం
NTA ప్రకారం, రికార్డుల ప్రకారం అభ్యర్థి ఐడీ నుంచి ఎగ్జామ్ సెంటర్‌ను అబుదాబికి మార్చుకున్నారు. మరో రెండు సందర్భాలలో కూడా ప్రివ్యూలో అబుదాబిగా కనిపించింది. అయినప్పటికీ, విద్యార్థి అభ్యర్థనను అంగీకరించి ఎన్టీఏ ఎగ్జామ్ సెంటర్ మార్చే ప్రక్రియను పూర్తి చేసింది.
స్టూడెంట్ ఫస్ట్ విధానంపై ఫోకస్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రాధాన్యత ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే అని పేర్కొంది. పరీక్ష రాయనున్న ఏ అభ్యర్థికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవడం, అవసరమైన సహాయాన్ని అందించడం ఏజెన్సీ లక్ష్యంగా ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
