NEET UG Re-Exam Admit Card: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌, ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి గ్రేస్ మార్కులు తొలిగించిన 1563 మంది అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 23న నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్ 30న వెల్లడించనున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే తెలిపింది. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.


నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..


నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.


➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.


➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.


➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.



నీట్-యూజీ 2024 ఫలితాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో జూన్ 13న విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. నీట్ ఫలితాల్లో 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దుచేస్తామని, వారికి మళ్లీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ యూజీ (NEET UG)-2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నీట్‌ (NEET) ఫలితాల్లో 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను (Grace marks) తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. 


Related Article:


'నీట్' పరీక్షలో ఆ విద్యార్థులకు గ్రేస్ మార్కులు రద్దు, వారికి మళ్లీ పరీక్ష - కౌన్సెలింగ్ నిలిపివేతకు సుప్రీం నిరాకరణ





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..