Civils Topper Anu Kumari Life style : గొప్ప కలను కనడం ఒక ఎత్తైతే దాన్ని సాకారం చేసుకోవడం కోసం ప్రణాళికా బద్ధంగా శ్రమించడం మరోక ఎత్తు. ఏ లక్ష్యసాధనలోనైనా సరే అడ్డంకులు తప్పకుండా వస్తాయి. అవి పరిస్థితులు కావచ్చు, పరిమితులు కావచ్చు అన్నింటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడమే విజయం. అలాంటి విజయం సాధించిన వనిత కథ.


మనదేశ యువతలో చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే ఆశ ఉంటుంది. అందులో పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా బ్యూరోక్రాట్ గా బతకాలనే లక్ష్యం కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు అను కుమారి. అనుకుమారి దృఢ సంకల్పం, అంకితభావానికి ప్రతీకగా చెప్పవచ్చు.


హర్యానాలోని సోన్పట్ కు చెందిన అనుకుమారి ఢిల్లీ యూనివర్సిటి నుంచి ఫిజిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గ్యాడ్యూయేషన్ తర్వాత ఐఎంటీ నాగ్ పూర్ నుంచి ఏంబీఏ పూరర్తిచేశారు. తర్వాత ఆమె మంచి జీతంతో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలోనూ చేరారు కూడా. నిజానికి ఆమె తన కెరీర్ ను అభివృద్ధి పథంలో నడుపుతున్నారనే చెప్పవచ్చు. అయినా ఆమెకు ఈ విజయాలు పెద్దగా తృప్తిని ఇవ్వలేకపోయాయి. ఆమె దేశ ప్రజలకు తన సేవలు అందించాలని అనుకుంది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం యూపీఎస్ సి.


2012 లో వివాహానంతరం తన భర్తతో కలిసి గురుగ్రామ్ కి తన నివాసాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత ఒక బిడ్డకు కూడా తల్లయ్యారు కానీ తన మనసులో ఉన్న లక్ష్యాన్ని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరనే అనాలి. ఆమె తప్పకుండా తానో ఐఏస్ గా ఉండాలనే తన సంకల్పాన్ని ఏమాత్రం సడలనివ్వలేదు. ఇందుకోసం తాను చాలా కృషి చెయ్యాల్సి ఉంటుందని ఆమెకు తెలుసు. అప్పటికే పెద్ద జీతంతో ఒక కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఆ ఉద్యోగం లక్ష్య సాధనకు అడ్డంకిగా మారుతోందని అనిపించి దాన్ని కూడా వదిలేశారు.


ఈ విషయం గురించి మాట్లాడుతూ అనుకుమారి ఒక సందర్భంలో ‘‘ నిజానికి అప్పటి నా ఉద్యోగం చాలా బావుందనే చెప్పాలి. కానీ నాకు మాత్రం వృత్తిపరమైన తృప్తిని ఇవ్వలేకపోయింది. కొంత కాలం ఉద్యోగాన్ని కొనసాగించిన తర్వాత అది చాలా యాంత్రికంగా అనిపించడం మొదలైంది. కొన్నాళ్లకు ఇక కొనసాగించలేననంత భారం అయిపోయింది.’’ అని చెప్పారు. ఇక అప్పుడు ఆమె తన అంతరాత్మ చెప్పేదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.


కానీ ఆమెకు తెలుసు ఆమె ఎంచుకున్న మార్గం అంత సులభమైందేమీ కాదని. చదువుకు సంబంధించిన సవాళ్లు మాత్రమే కాదు అప్పుడే కొత్తగా తల్లైన తనకు పసి వాడి బాధ్యత కూడా ఉంది. మరి లక్ష్య సాధనలో ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేనని భావించిన ఆమె మనసు రాయి చేసుకుని పసి వాడైన తన బిడ్డకు సైతం దూరంగా ఉన్నారు. మొదటి సారి యూపిఎస్సీ రాసినపుడు ఎదురైన వైఫల్యం ఆమెను కాస్త కుంగదీసిన మాట వాస్తవం. కానీ ఆమె నిరుత్సాహ పడలేదు. ఈ ఎదురుదెబ్బలే తన విజయానికి సోపానాలని నమ్మారు అనుకుమారి. ఈ సారి మరింత పట్టుదలతో, అంకిత భావంతో ప్రయత్నించారు. మరోసారి ప్రయత్నించారు. ఈ సారి ఆమె యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ – 2 లో నిలిచారు. ఐఏస్ గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇవ్వాళ యూపీఎస్సీ ద్వారా సర్వీస్ లో స్థానం సాధించాలనుకునే అనేక మందికి ఆమె స్ఫూర్తి ప్రధాయిని.


అలుపెరుగని ఆమె ప్రయత్నం, పట్టుదల, మొక్కవోని సంకల్పం విజయానికి సోపానాలు పరుస్తాయనే విషయాన్ని మరోసారి ఆమె రుజువు చేశారు. ఓటమి ఎదురైనపుడు సడలని ధైర్యంతో ముందుకు నడిచే వారు తప్పక విజయం సాధిస్తారు.