Water Bell in Schools: ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని పాఠశాల విద్యాశాఖ తప్పనిసరి చేసింది. పాఠశాలల్లో 'వాటర్ బెల్' కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఏప్రిల్ 2న ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రోజూ ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు కచ్చితంగా బెల్ మోగించాలి. ఆ సమయంలో విద్యార్థులు తప్పకుండా నీరు తాగేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పాఠశాలల్లో రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ కొట్టాలని సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.


స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఏపీలోని పాఠశాలలకు గతేడాది మే 1న వేసవి సెలవులు ప్రారంభంకాగా.. 42 రోజుల సెలవుల తర్వాత జూన్ 12న తిరిగి తెరచుకున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా  ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేస‌వి సెల‌వులు(AP Summer Holidays) మొదలుకానున్నాయి. జూన్ 11 వ‌రకు అంటే.. దాదాపుగా 50 రోజులు పాటు పాఠశాలలకు వేస‌వి సెల‌వులు రానున్నాయి. గతేడాది కంటే ఈసారి సమ్మర్ హాలీడేస్ ఎక్కువగా ఉండనున్నాయి.  


ఏప్రిల్ 6 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు..
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..


➥ ఏప్రిల్ 6 నుంచి 16 వరకు 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.  


➥ ఏప్రిల్ 6 నుంచి 18 వరకు 6 - 8 వ తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 


➥ ఏప్రిల్ 19న కాంపొజిట్ కోర్సు విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...