Mallareddy Colleges Digital Campus on Google Cloud launched: హైదరాబాద్ లో ప్రముఖ విద్యాసంస్థల గ్రూప్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్‌తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 'డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్' పేరుతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బుధవారం ఘనంగా ప్రారంభమయింది. ఈ భాగస్వామ్యం ద్వారా 50 వేల మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు, AI ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమం తెలంగాణ విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిందని మల్లారెడ్డి గ్రూప్ ప్రకటించారు.
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి 'డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్'ను అధికారికంగా ప్రారంభించారు. "డిజిటల్ టెక్నాలజీని విద్యా రంగంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ యువత సాంకేతికంగా మరింత బలోపేతమవుతుంది. ఇలాంటి భాగస్వామ్యాలు దేశ అభివృద్ధికి కీలకం" అని గవర్నర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో 50 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గూగుల్ లోగోతో రూపొందించిన 50 వేల బెలూన్‌లను ఆకాశంలోకి వదిలి, ఈ భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ భాగస్వామ్యం తెలంగాణలో మొట్టమొదటిసారి గూగుల్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మల్లారెడ్డి గ్రూప్ అధినేతలు తెలిపారు.
గూగుల్‌తో కుదిరిన ఈ భాగస్వామ్యం భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందంగా నిలవనుంది. విద్యార్థులకు గూగుల్ క్లౌడ్ ఆధారిత సాంకేతిక శిక్షణ, AI, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గూగుల్ సర్టిఫికేట్లు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అందిస్తారు. AI ఆధారిత లెర్నింగ్ సిస్టమ్స్ ద్వారా విద్యా ప్రక్రియను మరింత సమర్థవంతం చేస్తారు. 50 వేల మంది విద్యార్థులు ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇది వారి ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.
గూగుల్ సంస్థ నుంచి ఇండియా హెడ్-ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్స్ వైభవ్ కుమార్ శ్రీవాస్తవ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి గ్రూప్‌తో ఈ భాగస్వామ్యం భారత విద్యా రంగంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు మార్గం సుగమం చేస్తుంది. గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు సాధిస్తారని తెలిపారు. గూగుల్‌తో ఈ భాగస్వామ్యం మా విద్యాసంస్థలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది. విద్యార్థులు AI, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీలలో నిపుణులవుతారని మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.