JNTUH Evening B.Tech Spot Admissions: పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్హతతో ఉద్యోగాలు చేస్తూ.. ఉన్నత బీటెక్ చదువుకోవాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు జేఎన్‌టీయూ హైదరాబాద్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు సాయంత్రం వేళల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మరో 8 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్ అనుమతి ఇచ్చింది. ఆయాకళాశాలల స్ధాయిని బట్టి ఫీజును నిర్ణయించారు. కోర్సు ఫీజు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు నిర్ణయించారు. ఈ బీటెక్ ప్రవేశాలకు సంబంధించి త్వరలోనే 'స్పాట్ అడ్మిషన్' నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో స్పాట్ ప్రవేశాల నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ రావు తెలిపారు.   

ఈ కోర్సులో ప్రవేశాలు పొందినవారు సాయంత్రం వేళ బీటెక్ కోర్సు చదువుకోవచ్చు. ఈ కోర్సులను ప్రారంభించేందుకు అన్నిరకాల నియమ-నిబంధనలు, సబ్జెక్టులు, కోర్సులు, ఫీజుల వివరాలతో జేఎన్‌టీయూహెచ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.రమణ నేతృత్వంలో నివేదికను రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావుకు సమర్పించారు. ఈ ఏడాది డిప్లొమా ఉత్తీర్ణత శాతం ప్రాతిపదికన ర్యాంకులు కేటాయించి సీట్లు భర్తీ చేస్తారు. 

ఎవరు అర్హులు?
సాయంకాల బీటెక్ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు రిజిస్టర్డ్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు అర్హులు. వారికి ఒక ఏడాది ఉద్యోగ అనుభవం ఉండాలి. అయితే వారు పనిచేస్తున్న సంస్థ సంబంధిత కళాశాలకు 75 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.

కోర్సు వివరాలు..
* కోర్సు కాలపరిమితి మూడున్నర సంవత్సరాలు.
* మొత్తం 7 సెమిస్టర్లు ఉంటాయి. 
* రెగ్యులర్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. 
* ఒక్కో విభాగంలో 30 సీట్లు అందుబాటులో ఉంటాయి. 

ప్రవేశాలు కల్పిస్తున్న కళాశాలలు: జేఎన్‌టీయూహెచ్, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, ఎంజీఐటీ, సెయింట్ పీటర్స్, అనుబోస్-పాల్వంచ, జ్యోతిష్మతి- కరీంనగర్,  సిద్ధార్థ,  అబ్దుల్ కలామ్, మదర్ థెరిస్సా.

కళాశాలలు, ఫీజుల వివరాలు ఇలా... 

కళాశాల బీటెక్ బ్రాంచులు ఫీజు
జేఎన్‌టీయూహెచ్ సీఎస్‌ఈ, మెకానికల్, మెటలర్జికల్ రూ.50,000.
వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి సీఎస్ఈ, సీఎస్ఈ-ఏఐఅండ్ఎంఎల్, ఈసీఈ రూ.67,500.
ఎంజీఐటీ సివిల్, మెకట్రానిక్, మెటలర్జికల్ రూ.80,000.
సెయింట్ పీటర్స్ సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ రూ.48,000.
అనుబోస్-పాల్వంచ ఈఈఈ, మెకానికల్, మైనింగ్ రూ.47,500.
జ్యోతిష్మతి- కరీంనగర్ సీఎస్ఈ, సీఎస్ఈ-ఏఐ అండ్ ఎంఎల్ రూ.35,000.
సిద్ధార్థ సీఎస్ఈ-ఏఐఅండ్ఎంఎల్, సీఎస్ఈ- డేటాసైన్స్ రూ.34,000.
అబ్దుల్ కలామ్ ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ రూ.32,500.
మదర్ థెరిస్సా మెకానికల్ రూ.25,000.

'మేనేజ్‌మెంట్' దందా కట్టడికి చర్యలు..
ఇంజినీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా(బీ కేటగిరీ) సీట్ల అమ్మకాలను అడ్డుకునేందుకు శాశ్వత విధానాన్ని రూపొందించే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ కేటగిరీలో సీట్ల భర్తీకి సంబంధించి ఏటా విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అత్యధిక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపితే తమ వైపు వేలెత్తి చూపేవారే ఉండరని, తల్లిదండ్రులకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చేయాలనే పట్టుదలతో ఉన్న ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి..ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..