JEE Advanced Admit Card: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైనా 23 ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌లో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. మే 18న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ కాన్పూర్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 18న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 23 నుంచి మే 5 వరకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

JEE Advanced 2025 Admitcard

ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు మొత్తం 15.39 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో 14.75 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిలిమినరీ ఆన్సర్ కీని మే 26న విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి మే 26, 27 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆపై జూన్ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫైనల్ కీని,  ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థలు వరుసగా రెండుసార్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే వెసులుబాటు ఉంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ (IIT), నిట్‌(NIT)లలో ప్రవేశాలు కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, డ్యూయల్ డిగ్రీ బీటెక్ + ఎంబీఏ, డ్యూయల్ డిగ్రీ బీఎస్ + ఎంబీఏ  కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్ సీట్లు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి. రెండు పేపర్లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. 

ముఖ్యమైన తేదీలు..

➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షతేది: 18.05.2025.

➥ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు: 22.05.2025.

➥ ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల: 26.05.2025.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 26.05.2025 - 27.05.2025.

➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి: 02.06..2025. 

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తు ప్రారంభం: 02.06..2025. 

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తుకు చివరితేదీ: 03.06..2025. 

➥ జాయింట్ సీట్ అలోకేషన్ (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: 03.06..2025. 

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) పరీక్ష తేదీ: 05.06..2025. 

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) ఫలితాల వెల్లడి: 08.06..2025. 

JEE Advanced -2025 Notification

Website