JEE Advanced 2024 Cutoff Marks: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు జూన్ 9న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. టాప్-10లో ఏకంగా నాలుగు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు, టాప్-100లో మద్రాస్ రీజియన్‌లో 25 మంది ఉండగా.. అందులో తెలుగు విద్యార్థులే 20 మంది ఉండటం విశేషం. ఇక టాప్-500 ర్యాంకుల్లో మద్రాస్ రీజియన్ నుంచి 145 మంది అర్హత సాధించగా.. అందులో తెలుగు విద్యార్థులు 100 మంది వరకు ఉన్నారు. మొత్తంగా చూస్తే.. మద్రాస్ జోన్‌లో కౌన్సెలింగ్‌కు అర్హత పొందిన మొత్తం 11,180 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు 7 వేల నుంచి 8 వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో ఏటా 18-20 శాతం మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
టాప్-10లో నలుగురు..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాల్లో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భోగలపల్లి సందేశ్ 360 మార్కులకు 338 సాధించి 3వ ర్యాంకు సాధించాడు. అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలుకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకులో నిలిచారు. వీరిలో భోగలపల్లి సందేశ్, పుట్టి కుశాల్ కుమార్, సిద్విక్ సుహాస్ హైదరాబాద్‌లోనే చదువుతున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 టాపర్ల వివరాల కోసం క్లిక్ చేయండి..
పెరిగిన కటాఫ్ మార్కులు...
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 కటాఫ్ మార్కులను ఈసారి పెంచారు. 2017 తర్వాత అత్యధిక కటాఫ్ నిర్ణయించడం ఇదే తొలిసారు. 2017లో 366 మార్కులకు 128ని కటాఫ్‌గా నిర్ణయించారు. ఈసారి కటాఫ్‌ను జనరల్ కేటిగిరీకి 109గా నిర్ణయించారు. ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 98 మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 54 మార్కులుగా నిర్ణయించారు. 2021లో కటాఫ్ మార్కులను జనరల్ కేటగిరీకి 63 మార్కులు, 2022లో 55 మార్కులు, 2023లో 86 మార్కులుగా నిర్ణయించారు.
కౌన్సెలింగ్‌కు 48,248 మంది అర్హత..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలకు సంబంధించి మొత్తం మొత్తం 1,80,200 మంది హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. గతేడాది మొత్తం 43,773 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
జోసా రిజిస్ట్రేషన్ ప్రారంభం..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంయుక్తంగా నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 10న ప్రారంభమైంది. మొత్తం 5 విడతల కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇక జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 10 నుంచి జులై 23 వరకు మొత్తం 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది.