JEE Advanced Exam Fee Details: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజును అధికారులు మరోసారి పెంచారు. ఇలా ఫీజులు పెంచడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది దరఖాస్తు ఫీజు అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1450 ఉండేది. అయితే దాన్ని ప్రస్తుతం రూ.1600లకు, ఇతరులకు రూ.2,900 నుంచి రూ.3,200కి పెంచినట్లు ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కోటా కింద కేటాయించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తూ వస్తున్నారు.
జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్టంగా రెండు సార్లు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ సబ్జెక్టులుగా 2023 లేదా 2024లో చదివి ఉండాలి. మొదటిసారిగా 12వ తరగతి పరీక్షకు హాజరై ఉండాలి. 2022లో లేదా అంతకు ముందు పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈసారి పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే వచ్చే ఏడాది మే 26న పరీక్ష నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 23న ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఏప్రిల్ 21 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అయితే మే 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. మే 26న పరీక్ష నిర్వహించి జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు.
JEE (Advanced) 2024 – Information Brochure
JEE Advanced 2024 ముఖ్యమైన తేదీలివే..
➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.04.2024 (10:00 IST)
➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 30.04.2024 (17:00 IST)
➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.05.2024 (17:00 IST)
➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 17.05.2024 (10:00 IST) - 26.05.2024 (14:30 IST)
➥ పీడబ్ల్యూడీ అభ్యర్థుల ద్వారా స్క్రైబ్ ఎంపిక (40% కంటే తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు రాయడంలో ఇబ్బంది ఉన్నవారు): 25.05.2024.
➥ JEE (Advanced) 2024 పరీక్ష తేది: 26.05.2024 (శనివారం)
⫸ పేపర్-1: 09:00-12:00 IST
⫸ పేపర్-2: 14:30-17:30 IST
➥ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో: 31.05.2024 (17:00 IST) నుండి
➥ JEE (Advanced) 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ వెల్లడి: 02.06.2024 (10:00 IST)
➥ JEE (Advanced) 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 (10:00 IST) - 03.06.2024 (17:00 IST)
➥ JEE (Advanced) 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ వెల్లడి: 09.06.2024 (10:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09.06.2024 (10:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 10.06.2024 (17:00 IST)
➥ జాయింట్ సీట్ అల్లొకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభం: 10.06.2024 (17:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 పరీక్ష తేది: 12.06.2024 (09:00 IST - 12:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఫలితాల వెల్లడి: 15.06.2024 (17:00 IST)