Intermediate Board : తెలంగాణలో 2012-13 విద్యాసంవత్సరం కంటే ముందు ఇంటర్మీడియట్ ఒకేషనల్ చదివి, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న వారు పాత విధానంలో పరీక్ష రాసేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామని ఇంటర్ బోర్డు తెలిపింది. వచ్చే మార్చిలో పరీక్షలు రాసే విద్యార్థులకు పాత విధానం ప్రకారమే ఇంగ్లిష్‌లో 75 మార్కులు, జనరల్ ఫౌండేషన్ కోర్సు(జీఎఫ్‌సీ)లో 75, జాబ్ ట్రైనింగ్‌కు 50 మార్కులు ఉంటాయని పేర్కొంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానంలో కొత్త సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నపత్రాలు ఉంటాయని, ఆ ప్రకారం ఇంగ్లిషుకు 50 మార్కులు, జనరల్ ఫౌండేషన్ కోర్సుకు 50, జాబ్ ట్రైనింగ్‌కు 100 మార్కులతో పరీక్ష నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
నవంబరు 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం..
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు అక్టోబరు 26న ప్రకటించిన సంగతి తెలిసిందే. జూనియర్ కాలేజీలు నవంబర్ 14 వరకు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించాలని ఆయా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 వరకు ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.510, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు రూ.730, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు వివరించింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. చివరిగా రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించు అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ 'హాజరు' మినహాయింపు ఫీజు గడువు నవంబరు 18
తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి, అక్టోబరు 20 నుంచి నవంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 30 వరకు అవకాశం ఉంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఆ ఇంటర్నల్ పరీక్ష రద్దు..
తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. మరో ఇంటర్నల్ అయిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా, ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో కలపరు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.