➥ తెలంగాణలో పరీక్షలు రాయనున్న 9.47 లక్షల మంది విద్యార్థులు 


➥ ఏపీలో పరీక్షలకు 10 లక్షలకుపైగా విద్యార్థులు 


➥ ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ


తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల సందడి మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. మార్చి 15న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 4తో ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇరు రాష్ట్రాల ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పకడ్భందీగా నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసి కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. 


తెలంగాణలో 9.47 లక్షల మంది విద్యార్థులు..
➥ తెలంగాణలో రేపట్నుంచే (మార్చి 15) ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి!  పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  


➥ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెకండ్ ఇయర్ వాళ్లు 4,65,022 మంది. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.


➥ రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కలుపుకుని 614, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు 859 ఉన్నాయి. 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు , 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్‌ స్క్వాడ్లను ఇంటర్‌ బోర్డు నియమించింది.


➥ ఇంటర్‌లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్‌లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్‌లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్‌ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.


తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..



ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే బస్సు ఆపాల్సిందే.. 
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసి బస్సు ఆపేలా సూచనలిచ్చామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మాల్‌ ప్రాక్టీస్‌ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటామని, అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోందని నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఎలాంటి మానసిక ఒత్తిడి అనిపించినా విద్యార్థులు కౌన్సెలింగ్‌ తీసుకోవాలి.. ప్రతీ విద్యార్థి మనో ధైర్యంతో ఉండాలని తెలిపారు.


ఏపీలో 10 లక్షల మంది విద్యార్థులు..
➥ ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, సెకండియర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నారు.


➥ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1489 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 10,03,990 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,84,197 కాగా, సెకండియర్ విద్యార్ధులు 5,19,793గా ఉన్నారు.


➥ పూర్తిస్థాయి సీసీటీవీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అటు పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ షాపులను క్లోజ్ చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.


➥ పరీక్షా కేంద్రాల వద్ద వైద్య, నీటి సౌకర్యం ఏర్పాటు చేశామని.. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారని రాష్ట్ర ఇంటర్మీడియట్ కార్యదర్శి శేషగిరి బాబు స్పష్టం చేశారు.


ఏపీ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..