IIT, NIT Admissions: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈ విద్యాసంవత్సరంలో 355 సీట్లు అదనంగా వచ్చి చేరాయి. ఐఐటీల్లో గతేడాది 17,385 సీట్లు అందుబాటులో ఉండగా.. ఆ సంఖ్య ఈసారి 17,740కి చేరింది. ఇక ట్రిపుల్ ఐఐటీలు, నిట్‌లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో వాటిల్లోనూ సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి మొత్తం 121 విద్యాసంస్థల్లో 59,917 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 77,657 సీట్లను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) ద్వారా భర్తీ చేయనున్నారు. 


పెరిగిన సీట్ల వివరాలు ఇలా..


➥ తిరుపతి ఐఐటీలో గతేడాది 244 సీట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10 సీట్లతో నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తేవడంతో.. సీట్ల సంఖ్య 254కి చేరింది.  


➥ వరంగల్ నిట్(NIT)లో కొత్తగా సీఎస్‌ఈ (ఏఐ అండ్ డేటా సైన్స్) కోర్సును ప్రవేశపెట్టడంతో.. అదనంగా 60 సీట్లు చేరాయి. దీంతో సీట్ల సంఖ్య 989 నుంచి 1049కి పెరిగింది.  


➥ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ సీట్ల సంఖ్య 40 నుంచి 110కి పెరిగింది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఎస్‌ఈలో కొత్తగా 10 సీట్లు పెంచారు. దీంతో సీట్ల సంఖ్య 40 నుంచి 50కి పెరిగాయి. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్(మెటీరియల్స్ ఇంజినీరింగ్) కోర్సులో 60 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 


➥ ఐఐటీ గాంధీనగర్‌లో 30 సీట్లు పెరిగాయి. దీంతో సీట్ల సంఖ్య 370 నుంచి 400కి చేరింది. 


➥ ఐఐటీ బాంబేలోనూ 12 సీట్లు అదనంగా చేరాయి. గతేడాది 1356గా ఉన్న సీట్ల సంఖ్య ఈసారి 1368కి చేరింది. 


➥ ఐఐటీ-ధార్వాడ్‌లో 75 సీట్లు పెరిగాయి. అక్కడ సీట్ల సంఖ్య 310 నుంచి 385కి చేరింది.


➥ ఐఐటీ-భిలాయ్‌లో 50 సీట్లు పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 243 నుంచి 283కి చేరింది. 


➥ ఐఐటీ-భువనేశ్వర్‌లో 50 సీట్లు పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 476 నుంచి 496కి చేరింది. 


➥ ఐఐటీ-ఖగర్‌పూర్‌లో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 1869 నుంచి 1889కి చేరింది. 


➥ ఐఐటీ-జోధ్‌పూర్‌లో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 550 నుంచి 600కి చేరింది. 


➥ఐఐటీ-పాట్నాలో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 733 నుంచి 817కి చేరింది. 


➥ ఐఐటీ-గువాహటిలో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 952 నుంచి 962కు సీట్ల సంఖ్య పెరిగింది. 


➥ అన్ని ఐఐటీల్లో సీట్ల సంఖ్య పెరగగా.. ఐఐటీ మద్రాస్‌లో మాత్రం ఈసారి 6 సీట్లు తగ్గడం గమనార్హం.


జోసా కౌన్సెలింగ్ ప్రారంభం..
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 10న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. ఇక ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష రాసినవారు, ఫలితాల వెల్లడి తర్వాత జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 19 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 20 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 5 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 


జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 






మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..