GATE Admit Cards: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025 పరీక్ష అడ్మిట్ కార్డులు (GATE Halltickets) విడుదలయ్యాయి. ఐఐటీ రూర్కీ హాల్‌టికెట్లను జనవరి 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ వివనాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 8 లక్షలకు పైగా అభ్యర్థులు గేట్ రాయనున్నారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 1, 2 మరియు 15, 16 తేదీల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష..
ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీఆర్) చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టులకు 'గేట్' పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.
అభ్యర్థులకు సూచనలు..
అడ్మిట్ కార్డుపై పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలతో పాటు షిఫ్ట్ సమయం కూడా ఉంటుంది. పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంట తీసుకెళ్లాలి. లేదంటే పరీక్ష నిర్వాహకులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. మొబైల్స్, క్యాలికేటర్లు, రిస్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోని వెళ్లేముందు అడ్మిట్ కార్డు, ఐడీ ఫ్రూప్, పెన్ వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుపై సంతకాన్ని పోలి ఉండేలా పరీక్షా కేంద్రంలో సదరు అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే గేట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
పరీక్ష విధానం..
✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.
✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.