JEE (Advanced) 2025 Application: దేశంలోని ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 దరఖాస్తుల సమర్పణ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థుల నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణలో 13 పట్టణాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌ కాలేజీలు, టీసీఎస్‌ ఆయాన్‌ సెంటర్లలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ  ఐఐటీ కాన్పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే.


జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. వీటి తుది ఫలితాలు ఏప్రిల్‌ 23 లేదా అంతకంటే ముందే విడుదలకానున్నాయి. దీంతో ఏప్రిల్‌ 23 నుంచి అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది.పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 వరకు అవకాశం కల్పించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మే 11 నుంచి 18 మధ్య డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 18న రెండు సెషన్లలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థులు రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. మెయిన్స్‌ రాసిన వారిలో మెరిట్‌ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తారు. ఫలితాలను జూన్‌ 2న విడుదల చేసి ఆ తర్వాత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసి సీట్లను భర్తీచేస్తారు.


ఫీజు వివరాలు...


* దేశీయ విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.3200 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1600 చెల్లిస్తే సరిపోతుంది. విదేశీ విద్యార్థులు సార్క్ దేశాలకు చెందినవారైతే 100 యూఎస్ డాలర్లు, నాన్-సార్క్ దేశాలకు చెందినవారైతే 200 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 


* విదేశాల్లో పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 150 యూఎస్ డాలర్లు చెల్లించాలి. విద్యార్థులు సార్క్ దేశాలకు చెందినవారైతే 150 యూఎస్ డాలర్లు, నాన్-సార్క్ దేశాలకు చెందినవారైతే 250 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 


 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలంగాణలో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇక ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, చీరాల, గుడవల్లేరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నర్సారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సూర్యపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడలో పరీక్షలు నిర్వహించనున్నారు.


పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి. రెండు పేపర్లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. 


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2025.


➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2025.


➥ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 11.05.2025 నుంచి 18.05.2025 వరకు


➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షతేది: 18.05.2025.


➥ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు: 22.05.2025.


➥ ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల: 26.05.2025.


➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 26.05.2025 - 27.05.2025.


➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి: 02.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తు ప్రారంభం: 02.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తుకు చివరితేదీ: 03.06..2025. 


➥ జాయింట్ సీట్ అలోకేషన్ (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: 03.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) పరీక్ష తేదీ: 05.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) ఫలితాల వెల్లడి: 08.06..2025. 


JEE Advanced -2025 Notification


Website