అవగాహన పెంచేందుకే ఈ కోర్స్..
ఐఐటీ బాంబే త్వరలోనే క్యాస్ట్ అవేర్‌నెస్ కోర్స్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లోని ఎస్‌సీ, ఎస్‌టీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సమాన అవకాశాలు, వసతులు అందించేందుకు ఈ క్యాస్ట్ అవేర్‌నెస్ కోర్స్ ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడింది. కులం ఆధారంగా కొందరు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ఇది గమనించే సర్వే చేపట్టామని ఎస్‌సీ, ఎస్‌టీ విభాగం స్పష్టం చేసింది. ఈ సర్వేలోని కొన్ని నిజాలు వెల్లడయ్యాకే, కులంపై అవగాహన పెంపొందించేందుకు ఏదైనా చేయాలని ఆలోచించామని పేర్కొంది. ఆ తరవాతే క్యాస్ట్ అవేర్‌నెస్ కోర్స్‌ని రూపొందిచాలని భావించామని చెప్పింది. లింగ వివక్షను తగ్గించే విధంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గతేడాది జెండర్ సెన్సిటిసేషన్ కోర్స్‌ను ప్రవేశపెట్టింది బాంబే ఐఐటీ. ఇప్పుడు కుల వివక్షను కట్టడి చేసే కోర్స్‌పై దృష్టి సారించింది.
మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తారా..?
అయితే ఈ కోర్స్ ఎలా ఉంటుంది..? ఏయే సబ్జెక్ట్‌లుంటాయి అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. "క్యాస్ట్‌కి సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులను తగ్గించేందుకు, వారిలో ఏ వర్గ విభేదాలు లేకుండా చూసేందుకు ఎంతో ఆలోచించి ఈ కోర్స్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం" అని ఎస్‌సీ, ఎస్‌టీ సెల్ స్పష్టం చేసింది. దాదాపు 100 మంది విద్యార్థులతో ఓపెన్ డిబేట్ పెట్టింది ఈ సెల్. కులం ఆధారంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో విద్యార్థులు వివరించాలని కోరింది. ఈ మీట్‌లో విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రిజర్వేషన్ ద్వారా సీట్ సంపాదించిన వారిపై, మెరిట్ విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కొందరు చెప్పారు. ప్రత్యేక కోర్స్‌తో పాటు మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌నీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ ఎస్‌సీ, ఎస్‌టీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే వెసులుబాటు ఉంటుంది.
Also Read: Eat Mobility : ఈ - మెబిలిటీ అంటే ఈట్ మొబిలిటి ! ఆనంద్ మహింద్రా కొత్త ఇన్వెంటరీ