GATE 2024 Exam Schedule: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE)-2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరు(IISc) డిసెంబరు 5న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో రెండు షిఫ్టుల్లో 'గేట్' పరీక్ష నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష షెడ్యూలులో మారే అవకాశం ఉంది. 


గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.


గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.



పరీక్ష విధానం..


✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.


✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.


✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.


✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..


తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్


ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.


ALSO READ:


జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజును అధికారులు మరోసారి పెంచారు. ఇలా ఫీజులు పెంచడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది దరఖాస్తు ఫీజు అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1450 ఉండేది. అయితే దాన్ని ప్రస్తుతం రూ.1600లకు, ఇతరులకు రూ.2,900 నుంచి రూ.3,200కి పెంచినట్లు ఐఐటీ మద్రాస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కోటా కింద కేటాయించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులు. 
ఫీజు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...