Deemed University Status for IIMC: న్యూఢిల్లీలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC)'కి 'డీమ్డ్ టు బి' యూనివర్సిటీ హోదా లభించింది. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులకు పేరొందిన ఐఐఎంసీకి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిని కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనివల్ల కేవలం డిప్లొమాలే కాకుండా డిగ్రీలు ప్రదానం చేసేందుకు, డాక్టొరల్ ప్రోగ్రాంలు అందించేందుకు ఈ సంస్థకు వీలుంటుంది.
1965లో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో దిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఐఐఎంసీకి జమ్మూ, అమరావతి (మహారాష్ట్ర), ఆయిజోల్, కొట్టాయం, ఢెంకనాల్‌లలో ప్రాంతీయ క్యాంపస్‌లు ఉన్నాయి. ఆంగ్లం, హిందీతో పాటు ఉర్దూ, ఒడియా, మరాఠీ, మలయాళంలలో జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్ని ప్రస్తుతం అందిస్తోంది. డీమ్డ్-టు-బి-యూనివర్సిటీ స్థాయిని ఐఐఎంసీ పొందడం ఎంతో ప్రత్యేకం, చరిత్రాత్మకమని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ పేర్కొన్నారు.
గత 58 సంవత్సరాల నుంచి ఐఐఎంసీ అందిస్తున్న జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపై కేవలం డిప్లొమాలు మాత్రమే కాకుండా డిగ్రీలను ఇచ్చేందుకు ఈ సంస్థకు అధికారం కల్పించినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్తగా లభించిన హోదా వల్ల డాక్టొరల్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఈ సంస్థ ఆఫర్ చేయవచ్చు.
ALSO READ:
సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET-PG-2024) దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. వాస్తవానికి జనవరి 31తో ముగియాల్సిన గడువును ఫిబ్రవరి 7 వరకు పొడిగించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను మార్చి 11 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 324 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగనుంది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..