IECom 2026: సాంకేతిక రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, భవిష్యత్తు సవాళ్లపై చర్చించేందుకు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) వేదికైంది. యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన  ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డివైజెస్ (IECom-2026) 4వ అంతర్జాతీయ సదస్సు మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), 6G నెట్‌వర్క్ వంటి అత్యాధునిక అంశాలపై మేధోమథనం చేశారు.

 గ్లోబల్ రీసెర్చ్‌కు వేదిక 

ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకాగా, 147 పరిశోధనా పత్రాలను సమర్పించారు. ముఖ్యంగా క్వాంటం కమ్యూనికేషన్, సస్టైనబుల్ ఎలక్ట్రానిక్స్, ఐఓటీ (IoT) , బయోమెడికల్ ఇంటర్‌ఫేస్ వంటి కీలక రంగాలపై లోతైన చర్చలు జరిగాయి. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, నిట్ వరంగల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు జర్మనీలోని సీమెన్స్, మలేషియా యూనివర్సిటీ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో భాగస్వాములయ్యారు.

 ప్రముఖుల ప్రసంగాలు - ఆవిష్కరణలు 

సదస్సులో భాగంగా ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ అన్బరసు మణివన్నన్  హై-స్పీడ్ కంప్యూటింగ్ కోసం అడ్వాన్స్‌డ్ మెమరీ టెక్నాలజీ పై ప్రసంగించగా, జర్మనీకి చెందిన సీమెన్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పరం బెనర్జీ స్మార్ట్ గ్రిడ్స్ మరియు సస్టైనబుల్ ఎనర్జీ  ప్రాముఖ్యతను వివరించారు. అలాగే, ఏఐ ఆధారిత థర్మల్ ఇమేజింగ్ ద్వారా ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులను డాక్టర్ ప్రశాంత్ హరి వివరించారు. ఈ సదస్సు హైబ్రిడ్ మోడ్‌లో జరగడం వల్ల వర్చువల్‌గా కూడా భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు.

పరిశోధనలకు పెద్దపీట 

మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.వి. రమణ  అకాడెమియా ,  పరిశ్రమల మధ్య వారధిని నిర్మించడమే లక్ష్యంగా ఇలాంటి సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. యువ పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఇదొక గొప్ప వేదిక అని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో ఎంపిక చేసిన పరిశోధనా పత్రాలను ప్రఖ్యాత స్కోపస్  ఇండెక్స్ జర్నల్స్‌లో ప్రచురించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.  మోహన్ బాబు ,  విష్ణు మంచు నాయకత్వంలో MBU పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా మారుతోందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.