Varma vs Dorababu in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కూటమి రాజకీయాల్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లడం నియోజకవర్గంలో కలకలం రేపింది. మంగళవారం పాడా (PADA) కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య ఈ స్థాయి గొడవ జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
చంద్రబాబు ఫోటో ఎక్కడ?
కార్యక్రమం ప్రారంభం కాగానే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్లెక్సీ విషయంలో అధికారులను నిలదీయడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన పాడా పీడీని ప్రశ్నించారు. అధికారులు వివరణ ఇస్తుండగా, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యం చేసుకున్నారు. ఫోటో పెట్టారని, ప్రతి చిన్న విషయానికి వివాదం చేయడం సరికాదని దొరబాబు అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో దొరబాబు వర్మపైకి దూసుకురావడంతో ఉద్రిక్తత పెరిగింది.
కార్యకర్తల మధ్య పెనుగులాట
నేతల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా జనసేన - టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడటంతో పోలీసులు, ఇతర నాయకులు రంగప్రవేశం చేసి వారిని విడదీశారు. తీవ్ర మనస్తాపానికి గురైన వర్మ అక్కడి నుండి తన కారులో వెనుదిరిగారు. వర్మ కావాలనే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తుండగా.. అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని టీడీపీ వర్గం మండిపడుతోంది.
దాడుల సంస్కృతిపై టీడీపీ ఆగ్రహం
ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై వివరణ కోరితే దాడికి యత్నించడం దారుణమని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు తమ తప్పు ఒప్పుకున్నా, పెండెం దొరబాబు అనవసరంగా కలుగజేసుకుని వర్మపై భౌతిక దాడికి దిగడం అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. పార్టీ మారినా దొరబాబులో పాత అలవాట్లు పోలేదని, కూటమిలో ఉంటూనే మిత్రపక్ష నేతలపై దురుసుగా ప్రవర్తించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ముదిరిన ఆధిపత్య పోరు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం వర్మ తన సీటును త్యాగం చేసినప్పటి నుండి, నియోజకవర్గంలో ఆధిపత్యం ఎవరిది అనే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు పెండెం దొరబాబు జనసేనలో చేరడం, అధికారిక ప్రోటోకాల్ విషయంలో వర్మను పక్కన పెడుతున్నారనే భావన టీడీపీ క్యాడర్‌లో బలంగా ఉంది. ఈ ఫ్లెక్సీ వివాదం కేవలం నిమిత్తం మాత్రమేనని, లోలోపల ఉన్న ఆధిపత్య పోరు ఈ రూపంలో బయటపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
