CA May 2024 Exams: ఐసీఏఐ సీఏ ఇంట్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మార్చి 19న విడుదల చేసింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ఐసీఏఐ ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 3 నుంచి 16 వరకు సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఏ ఇంటర్ గ్రూప్-1 పరీక్షలను మే 3, 5, 9 తేదీల్లో; గ్రూప్-2 పరీక్షలను మే 11, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక సీఏ ఫైనల్ గ్రూప్-1 పరీక్షలను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్-2 పరీక్షలను మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసస్‌మెంట్ టెస్ట్‌ను మే 14 - 16 మధ్య నిర్వహించనున్నారు.


లోక్‌సభ ఎన్నికల తేదీల్లోనే సీఏ పరీక్షలు ఉండటంతో పరీక్షలను 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' వాయిదావేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 16న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి జూన్ 26 వరకు సీఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను మార్చాలని ICAI నిర్ణయించింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలును మార్చి 19న వెల్లడించింది. 


సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల షెడ్యూలు..


➥ సీఏ ఇంటర్ పరీక్షల షెడ్యూలు..


గ్రూప్-1: మే 3, 5, 9 తేదీల్లో.


గ్రూప్-2: మే 11, 15, 17 తేదీల్లో 


➥ సీఏ ఫైనల్ పరీక్షల షెడ్యూలు..


గ్రూప్-1: మే 2, 4, 8 తేదీల్లో.


గ్రూప్-2: మే 10, 14, 16 తేదీల్లో.


➥ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసెస్‌మెంట్ టెస్ట్‌


మే 14 - 16 వరకు



ఐసీఎస్‌ఐ సీఎస్ రివైజ్డ్ షెడ్యూలు..
ఐసీఎస్‌ఐ సీఎస్ (కంపెనీ సెక్రటరీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు మార్చి 19న ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 1 నుంచి ప్రారంభంకావాల్సిన ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షలు జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు జూన్ 10తో ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే జూన్ 11 - 14 వరకు తేదీలను రిజర్వ్‌లో ఉంచింది. పరీక్షల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థలు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


ఎన్నికల సమయంలో ఇతర పరీక్షల వివరాలు ఇలా..


➥ ప్రధానంగా తెలంగాణలో మే 9 నుంచి 12 వరకు TS EAPCET, ఏపీలో మే 13 నుంచి 19 వరకు AP EAPCET పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్దులు హాజరుకానున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్‌ జరుగనుంది. అంటే మే 12న పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకొంటారు. ఈ నేపథ్యంలో ఎప్‌సెట్‌ పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. ఇంజినీరింగ్‌ పరీక్షలను సజావుగా నిర్వహించవచ్చని, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందన్న భావన అధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌, ఫార్మసీవిభాగం పరీక్షను వాయిదా వేయడ మా.. ? లేదా మొత్తానికి మొత్తం పరీక్షలను వాయిదా వేయాలా..? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష షెడ్యూలు మార్చే యోచనలో అధికారులు ఉన్నారు.


➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ఐసెట్‌ పరీక్షలను జూన్‌ 4, 5న నిర్వహిస్తామని కాకతీయ యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లలెక్కింపు కూడా జూన్‌ 4న జరుగనున్నది. అంటే, ఈ లెక్కన ఐసెట్‌ వాయిదావేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 


➥ తెలంగాణలోని  ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం మే 13 నుంచి 21 వరకు నిర్వహించే డిపార్టుమెంటల్‌ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.


➥ మరోవైపు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఎన్నికల సమయంలోనే డిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామకాలకు  మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది అభ్యర్థులు హాజరవుతుంటారు.


➥ ఇక మే 2 నుంచి 13 వరకు ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తుంటారు.


➥ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను మే 26న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.


➥ కేంద్రీయ విద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.


➥ ఇక జేఈఈ 2024 మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేశారు.