Government Schools in Grama Panchayats: తెలంగాణలోని ప్రతి గ్రామపంచాయతీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటుకానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ బడులు లేని గ్రామపంచాయతీల్లో 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఆ పాఠశాలల్లో తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించి.. పాఠాలు బోధించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జనవరి 9న పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి డీఈవో సుశీందర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చోట్ల వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించడంలో సమస్యల గురించి ఆరా తీశారు. ఎస్‌సీఈఆర్‌టీ(SCERT)కి పైరవీల ద్వారా ఉపాధ్యాయులు వస్తున్నారని, ఇక నుంచి దరఖాస్తులు స్వీకరించి.. ప్రతిభ ఆధారంగా నియమించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖకు సంబంధించిన కోర్టు కేసులు సకాలంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు ధిక్కరణ వరకు పరిస్థితి వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించారు.


త్వరలో సీఎం సమీక్ష!
రాష్ట్రంలో 'మన ఊరు- మన బడి' కింద పాఠశాలల్లో కొనసాగుతున్న పనులు, ఖర్చుచేసిన నిధులు, తదితర పూర్తి వివరాలను సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను వెంకటేశం ఆదేశించారు. ఈ కార్యక్రమంపై త్వరలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని ఆయన చెప్పినట్లు తెలిసింది. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


గత సమీక్షలో సీఎం ఏమన్నారంటే?
విద్యాశాఖపై డిసెంబరు 30న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని సమస్యలపై అధికారులతో చర్చించిన సంగతి తెలసిందే. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లలో ఉన్న సమస్యలు, అవాంతరాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని సూచించారు. విద్యాలయాలకు పారిశ్రామిక కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.


ఏప్రిల్‌లో టెట్ నిర్వహణ..?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో (CM Review Meet) ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించడానికి టెట్‌ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా టెట్‌ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...