GATE 2026 Registration Process | ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. IIT గౌహతి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) గేట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, ఇతర సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, PhD ప్రోగ్రామ్‌లలో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ఆగస్టు 28 నుండి గేట్ 2026కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు తుది గడువు సెప్టెంబర్ 28, 2025 అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లేట్ ఫీజుతో అక్టోబర్ 9వరకు గేట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తొలుత తెలిపిన షెడ్యూల్ ప్రకారమైతే నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ మూడు రోజులపాటు ప్రక్రియ వాయిదా పడింది.
గేట్ 2026 ఎగ్జామ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీలలో నిర్వహించనున్నారు. గేట్ ఎగ్జామ్ రెండు షిఫ్ట్‌లలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు 2 జనవరి 2026 నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 19 నుండి గేట్ స్కోర్‌కార్డ్‌లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. గేట్ స్కోర్ వచ్చిన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
కొత్త పేపర్ చేర్చారని తెలుసా
ఈసారి గేట్ 2026 పరీక్షలో ఒక ప్రత్యేక మార్పు చేశారు. ఇంజనీరింగ్ సైన్స్ (XE) కింద ఎనర్జీ సైన్స్ అనే కొత్త పేపర్ చేరింది. అయితే మొత్తం ఎగ్జామ్ పేపర్ల సంఖ్య 30 గానే ఉంటుంది. పరీక్ష స్వరూపం గతంలోలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గా నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి
గేట్ 2026లో దరఖాస్తు రుసుము అభ్యర్థుల కేటగిరీని బట్టి వేర్వేరుగా ఉంటుంది. మహిళా అభ్యర్థులతో పాటు SC, STలు, దివ్యాంగుల కోసం సాధారణ వ్యవధిలో అప్లికేషన్ ఫీజు ₹1000, లేట్ ఫీజు పొడిగించిన వ్యవధిలో ₹1500 ఉంటుంది. ఇతర కేటగిరీలైన జనరల్, ఓబీసీ అభ్యర్థులందరికీ సాధారణ వ్యవధిలో ₹2000 అప్లికేషన్ ఫీజు.. పొడిగించిన తేదీల వ్యవధిలో ₹2500 గా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI వంటి ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే చెల్లించవచ్చు.
GATE 2026కు ఎలా దరఖాస్తు చేయాలి?
- అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ని సందర్శించండి.
- తరువాత "రిజిస్ట్రేషన్" పై క్లిక్ చేసి, మీ పేరు, ఇమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి
- తరువాత, రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ లభిస్తుంది.
- ఇప్పుడు లాగిన్ చేసి అప్లికేషన్ ఫాంను తెరిచి, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, విద్యార్హతలు లాంటి మీ వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి. పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాలి.
- అనంతరం మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను (Caste సర్టిఫికేట్ లేదా దివ్యాంగ సర్టిఫికేట్ వంటివి) అప్‌లోడ్ చేయండి.
- ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా క్రిడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
- అన్ని వివరాలను చెక్ చేసుకున్నాక దరఖాస్తు ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.