విదేశాల్లో ఉన్నతవిద్య కోసం నిర్వహించే జీఆర్‌ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ ఏడాది నుంచి జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌) పరీక్షలో పలు సంస్కరణలకు ఈటీఎస్(ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌) శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు దాదాపు నాలుగు గంటల పాటు జరిగే జీఆర్‌ఈ పరీక్షను ఇప్పుడు రెండు గంటలకు కుదించారు. పరీక్ష ఫలితాలు కూడా కేవలం 10 రోజుల్లోనే వెల్లడించనున్నారు. ఇన్నాళ్లూ జీఆర్‌ఈ పరీక్ష మూడు గంటల 45 నిమిషాల పాటు జరిగేది. ఫలితాన్ని 15 రోజుల్లోపు ప్రకటించేవారు. కానీ, తాజాగా చేసిన మార్పులతో పరీక్ష సమయం ఒక గంట 58 నిమిషాలకు తగ్గింది. ఫలితాన్ని కూడా పది రోజుల్లోపే ప్రకటిస్తారు. వచ్చే సెప్టెంబరు నుంచి ఈ విధానం అమలు కానుంది. 


గ్రాడ్యుయేషన్, బిజినెస్, లా స్కూల్‌ అడ్మిషన్లలో మరింత ప్రభావవంతంగా పనిచేసేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. నాలుగు గంటలపాటు జరిగే పరీక్షను కాస్తా 2 గంటలకు తగ్గించారు. అయితే వెర్బల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ రైటింగ్‌ స్కిల్స్‌ వంటి విభాగాలేవీ మారలేదు. కానీ వీటిలో అడిగే ప్రశ్నల సంఖ్య, వాటికి సమాధానాలు రాసేందుకు ఇచ్చే గడువు మాత్రం తగ్గింది. అలాగే అన్‌స్కోర్డ్‌ సెక్షన్, షెడ్యూల్డ్‌ బ్రేక్‌ను పూర్తిగా తీసివేయడం జరిగింది. 


జీఆర్‌ఈ పరీక్ష సమయాన్ని తగ్గించడం ద్వారా మరింత సూటిగా ప్రశ్నలు ఉండటంతోపాటు ఫలితాలు కూడా వేగంగా వస్తాయి. ఈ మార్పులను గతంలో పరీక్ష రాసిన అభ్యర్థులు, నిపుణుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిర్ణయించారు. అభ్యర్థిని కచ్చితమైన అంచనా వేస్తూనే పరీక్షాప్రక్రియను సులభతరం చేయడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా అనలిటికల్‌ రైటింగ్‌ సెక్షన్‌లో ‘అనలైజ్‌ ఏన్‌ ఆర్గ్యుమెంట్‌’ సెక్షన్‌ను పక్కకుపెట్టారు. అలాగే ఇతర విభాగాల్లోనూ ప్రశ్నల సంఖ్య తగ్గించారు. 


ప్రస్తుత ఫార్మాట్‌లో పరీక్ష రెండో గంట తర్వాత గడియారం ఆగాక ఒక షెడ్యూల్డ్‌ బ్రేక్‌ ఉంటుంది. అయితే కొత్త ఫార్మాట్‌లో ఇటువంటిదేమీ లేదు. అయితే విద్యార్థులు అన్‌షెడ్యూల్డ్‌ బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో గడియారం ఆగాలంటే డిజేబిలిటీ లేదా ఇతర అనారోగ్య కారణాలతో ముందే అనుమతి తీసుకుని ఉండాలి. ఇంట్లో పరీక్ష రాసేవారికి ఈ బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉండదు.


ఫలితాలు మరింత వేగంగా..
జీఆర్‌ఈ  పరీక్ష విధానంలో మార్పులతోపాటు ఫలితాలను కూడా వేగవంతం చేయనున్నారు. కేవలం 8 నుంచి 10 రోజుల్లో స్కోర్లు రావడం వల్ల అభ్యర్థులు తమ దరఖాస్తులను వేగంగా పంపించుకునే వీలుంటుంది. కాలేజీల డెడ్‌లైన్స్‌ వల్ల  ఇబ్బంది పడే అవకాశం విద్యార్థులకు ఇక ఉండదు.


సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి..
సెప్టెంబరు 22 నుంచి జరిగే జీఆర్‌ఈ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొత్త పద్ధతికి సంబంధించి ప్రిపరేషన్‌ రిసోర్సులు, సాధన టెస్టులు తీసుకోవచ్చు. చాలావరకూ పాత పద్ధతిలోనే ప్రశ్నలు ఉండటం వల్ల ఇదివరకటి మెటీరియల్స్‌ కూడా ఉపయోగించవచ్చు. చెల్లించాల్సిన ఫీజులోనూ, స్కోర్‌ స్కేల్స్‌లోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.


Website


Also Read:


దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన ఐఐటీ-మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ తర్వాత రెండో స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా, 3వ స్థానంలో ఐఐటీ-ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యాసంస్థల్లో ఐఐటీ-హైదరాబాద్ 14వ స్థానంలో నిలవగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) 53వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాసు అగ్రస్థానంలో నిలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..