Trending
TS EAPCET: టీఎస్ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరి 'కీ' విడుదల - అభ్యంతరాలకు అవకాశం
టీఎస్ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగపు పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూహెచ్ మే 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

Telangana EAPCET 2024 Engineering Answwr Key: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9 నుంచి 11 వరకు నిర్వహించిన ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగపు పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూహెచ్ మే 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు మే 12 నుంచి 14 వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు ఒకవేళ ఆన్సర్ 'కీ'పై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 14న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా విభాగపు ఆన్సర్ కీ విడుదలైన సంగతి తెలిసిందే. మే 13 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
Master Question Papers With Preliminary Key
మే 25న ఫలితాల వెల్లడి..
ఎప్‌సెట్ ఫలితాలు మే 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మే 25న కుదరకపోతే మే 27న ఫలితాలు విడుదల చేసేందుకు జేఎన్‌టీయూ అధికారుల సన్నాహకాలు చేస్తున్నారు.
తెలంగాణలో టీఎస్‌ఈఏపీసెట్-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రెండురోజుల్లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల తొలిరోజైన జూన్ 7న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్‌కు 90.41 శాతం మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌కు 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా, 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో, 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు 91.67% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది హాజరైనట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. జూన్ 15న ఎప్‌సెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని మే 12 ఉదయం విడుదల చేయనున్నారు. విద్యార్థులు కీ తో పాటు రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రాన్ని ఎప్సెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 14 ఉదయం 10 గంటల వరకు పంపుకోవచ్చు.