దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు సంబంధించి మే 29 నుంచి జూన్ 2 వరకు నిర్వహించనున్న పరీక్షల అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21 నుంచి జూన్ 2 వరకు; అదేవిధంగా.. జూన్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే గతంలో మే 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను విడదల చేసిన ఎన్టీఏ.. మే 29 నుంచి జూన్ 2 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేసింది. మిగతా తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
సీయూఈటీ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరవచ్చు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించవచ్చు.
పరీక్ష విధానం..
యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లో 45 లేదా50 ప్రశ్నలకు గానూ 35 లేదా 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
సీయూఈటీ యూజీ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల! ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూలు మే 27న విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26 నుంచి జులై 19 మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తర్వాత జులై 21 నుంచి 31 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 2 నుంచి 9 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 8న విడుదల చేయనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తిస్థాయి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..