Just In





CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న పరీక్ష!
వివిధ కారణాల దృష్ట్యా కొన్ని పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విరమించుకుంది. దీంతో 11 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారు. వీరికి ఆగస్టు 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ పరీక్షలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వీటిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆరు విడతలుగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 17 నుంచి 20 వరకు నాలుగో విడత పరీక్ష జరుగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా 3 లక్షల 72 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా కొన్ని పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విరమించుకుంది. దీంతో 11 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారు. వీరందరికి ఆగస్టు 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని NTA ప్రకటించింది. వారంతా తమకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం సీయూఈటీ యూజీ పరీక్షలు ఆగస్టు 28న ముగియాల్సి ఉంది. అయితే తాజాగా చివరిదైన ఆరో విడత పరీక్షలను ఆగస్టు 24 నుంచి 30 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది.
Also Read: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!
ఇప్పటికే రెండో విడత సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎత్తివేసింది. ఈ కారణంతో పరీక్ష రాయలేకపోయిన వారికి ఆగస్టు 30 నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. వీరికి ఆగస్టు 20 నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరికి కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. తొలుత ఆగస్టు 12, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, వరుస పండుగల నేపథ్యంలో పరీక్ష తేదీల్ని మార్చాలని పలువురు విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. దీంతో కొత్త తేదీల్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET-UG ) నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని కేంద్రాల్లో తొలి విడత, మొత్తం 489 కేంద్రాల్లో రెండో విడత పరీక్ష రద్దయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలను నిర్వహించడానికి ఎన్టీఏ ఈ మేరకు షెడ్యూలు ఖరారుచేసింది. ఈ పరీక్ష కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు CUET UG 2022 పరీక్షలకు హాజరవుతున్నారు.
Also Read: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
పరీక్ష విధానం:
▶ CUET UG 2022 పరీక్ష కోసం UGC ప్రత్యేకంగా సిలబస్‌ను జారీ చేయలేదు. ఈ పరీక్ష NCERT సిలబస్ ఆధారంగా ఉంటుంది. పరీక్ష సిలబస్ పూర్తిగా 12వ తరగతి NCERT సిలబస్‌పై ఆధారపడి ఉంటుంది. CUET 2022లోని 27 సబ్జెక్ట్‌లలో ఒక విద్యార్థి గరిష్టంగా ఆరు డొమైన్‌లను ఎంచుకోవచ్చు.
▶ CUET UG 2022 ఎగ్జామ్‌లో సెక్షన్-IA, సెక్షన్-IB , సెక్షన్-II (డొమైన్-స్పెసిఫిక్ టాపిక్స్), సెక్షన్-III (జనరల్ టెస్ట్) వంటి నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొదటి మూడు సెక్షన్‌లలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-III లో 75 ప్రశ్నలు ఉంటాయి.
▶ మొదటి మూడు సెక్షన్లకు 45 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. జనరల్ టెస్ట్ సెక్షన్‌కు 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
▶అభ్యర్థులు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, ఇంగ్లిష్ వంటి 13 భాషలలో ఒక భాషను ఎంపిక చేసుకుని పరీక్ష రాయవచ్చు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..