Telugu News : పిల్లల్ని కొత్తగా స్కూల్లోకి పంపటం అనేది పేరెంట్స్ జీవితంలో ఒక ఉత్సాహభరితమైన మైల్ స్టోన్ లాంటిది. అయితే మీ పిల్లల స్కూల్ జర్నీ విజయవంతంగా మొదలుపెట్టటానికి కొంత ప్రిపరేషన్ అవసరమవుతుంది. ఈ సంవత్సరమే మీ బుజ్జాయిని స్కూల్ కి పంపబోతున్నా లేదా కొత్త స్కూల్ లోకి మార్పిస్తున్నా మీరు కొన్ని విషయాలు చెక్ చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.


మెటీరియల్


బ్యాక్ ప్యాక్: 


స్కూల్ కి పంపించేటపుడు మీ చిన్నారి మోయగలిగేంత బరువులోనే బ్యాగ్ ని ప్యాక్ చేసారా చూసుకోండి. అనవసరమైన బరువుతో మీ పిల్లలు స్కూల్ కి వెళ్లటానికి మోత బరువు వల్ల భయపడేలా చేయకూడదు. టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిల్స్ కలర్ఫుల్ గా, వాళ్లకు నచ్చిన బొమ్మలుండేలా గానీ చూసుకుంటే పిల్లలు ఇష్టంగా స్కూల్ కు వెళ్తారు.


స్టేషనరీ:


పెన్సిల్స్, పెన్నులు, నోట్ బుక్స్, ఇంకా వారి స్కూల్ కరిక్యులం బట్టి కావల్సిన స్టేషనరీ అంతా ప్యాక్ చేసారా చెక్ చేసుకోండి.


లేబుల్స్:


చిన్న పిల్లలు స్కూల్లో వారి వస్తువులను పోగొట్టుకోవటం సర్వసాధారణం. అన్ని వస్తువుల మీద వారి పేరుతో లేబుల్స్ అంటిస్తే, పోగొట్టుకున్నా సింపుల్ గా దొరుకుతాయి. ఈ మధ్య కాలంలో పిల్లల ఫొటోలు, పేర్లతో లేబుల్స్ వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. 


యూనిఫార్మ్/డ్రెస్ కోడ్


మీ పిల్లలు వెళ్లే స్కూల్లో యూనిఫార్మ్ ఎలాంటిదో కనుక్కొని, ఒకటి కంటే ఎక్కువ జతలు కొనటం మంచిది. వారాంతం వరకు ఒకటే అయితే ఒక్కోసారి యూనిఫార్మ్ ఉతికి లేనపుడు ఇబ్బంది పడుతారు. అలాగే ఏదేనా ఒకరోజు, రెండ్రోజులు డ్రెస్ కోడ్ లో మార్పు కొన్ని స్కూళ్లలో ఉంటుంది. స్కూల్ ని బట్టి డ్రెస్ కోడ్ రూల్స్ వేరుగా ఉంటాయి. అవి జాగ్రత్తగా కనుక్కొని పాటించండి.


హెల్త్/ సేఫ్టీ


మీ పిల్లలకు ఏదైనా మెడికల్ హిస్టరీ ఉండుంటే, అది ముందుగానే స్కూల్ మేనేజ్మెంట్ కి తెలియజేయండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటేల్స్ తప్పకుండా ఇవ్వండి. మీ పిల్లలు ఏదైనా హెల్త్ కండీషన్ కు సంబంధించి మెడిసిన్స్ వాడుతుంటే, అవి తప్పకుండా బ్యాగ్ లో పెట్టండి. స్కూల్లో ఉండే కేర్ టేకర్స్ తో ఈ విషయమై మాట్లాడి, మీ పిల్లలు సమయానికి మెడిసిన్స్ తీసుకునేలా చూడండి. 


కొత్త అకాడమిక్ సంవత్సరానికి సిద్ధం చేయటం


వేసవి సెలవుల్లో పిల్లలు ఆటపాటలతో గడుపుతూ చాలామటుకు చదవటం, రాయటం మర్చిపోతుంటారు. పోయిన అకాడమిక్ సిలబస్ లోని బేసిక్స్ రివైండ్ చేయించటం, రీడింగ్ ప్రాక్టిస్ చేయించటం, అవసరమైతే ట్యూటర్ ను నియమించటం చేస్తే, కొత్త అకాడమిక్ సంవత్సరంలో ఇబ్బంది పడకుండా ఉంటారు.


ఎమోషనల్, సోషల్ ప్రిపరేషన్


మీ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన విషయం ఇది. కొత్త స్కూల్ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి సబ్జెక్టులు ఉంటాయి అనేది స్కూల్లో చేర్పించటానికి ముందే వాళ్లను మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉంచాలి. లేదంటే, సడెన్ గా అంత మార్పును ప్రాసెస్ చేయటం వారికి కష్టమవుతుంది. వీలైతే స్కూల్లో చేర్పించటానికి ముందు రోజే వారిని స్కూల్ కి తీసుకెళ్లి చూపించండి. ఆ వాతవరణానికి కొద్దిగా అలవాటు పడతారు.


కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవటం, గ్రూప్ యాక్టివిటీస్ లో పాల్గొనటం, తోటి వారి పట్ల గౌరవంగా నడుచుకోవటం వంటివి ఎంకరేజ్ చేయండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీ పిల్లలకు అవసరమైన సపోర్ట్ ఇస్తూ, కావలిసినవన్నీ సమకూరిస్తే, వారు చదువుతో పాటూ, ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా స్కూల్ జీవితాన్ని విజయవంతంగా గడుపుతారు.