దేశంలోని యూనివర్సీటీలు, కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక ఆదేశాలు జారీచేసింది. విద్యాసంస్థలన్నీ ఇకపై తమ వెబ్‌సైట్‌లలో ఫీజులు, రిఫండ్ పాలసీ, హాస్టల్ వసతులు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్, ర్యాంకింగ్స్, అక్రిడిటేషన్ వంటి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకతను పెంచేలా, విద్యార్థులు తప్పుదోవపట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా ఉంచాల్సిన కంటెంట్‌కు సంబంధించి ఓ చెక్ లిస్ట్‌ను విడుదల చేసింది. కొన్ని విశ్వవిద్యాలయాలు తమ వెబ్‌సైట్లలో ప్రాథమిక సమాచారాన్ని కూడా పేర్కొనకపోవడం, కొన్ని వెబ్‌సైట్లు సరిగా పనిచేయకపోవడం, అప్‌డేట్ చేయకపోవడం వంటి అంశాలను గమనించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టినట్టు యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు.
యూనివర్సిటీలు, కళాశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటులో లేకపోతే విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంటుందని జగదీశ్ కుమార్ అన్నారు. అందువల్లే విద్యాసంస్థలు వెబ్‌సైట్లలో పొందుపరచాల్సిన అంశాలతో చెక్‌లిస్ట్‌ను తయారు చేసినట్టు తెలిపారు.
చెక్‌లిస్ట్ వివరాలు..
యూజీసీ రూపొందించినఈ చెక్‌లిస్ట్‌లో ఉన్నత విద్యాసంస్థలు/వర్సిటీల పేటెంట్ల వివరాలు, విదేశీ, పరిశ్రమలతో సహకారం, అంతర్గత నాణ్యత భరోసా కేంద్రం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, హెల్ప్‌లైన్‌తో కూడిన యాంటీ ర్యాగింగ్ సెల్, సమాన అవకాశాలకు సంబంధించిన విభాగం, పూర్వ విద్యార్థుల సంఘం, అంబుడ్స్‌మన్, అనుబంధ కళాశాలలు, ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ, సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగం, పౌర సంబంధాల విభాగం, అప్పిలేట్ అథారిటీ తదితర వివరాలతో యూజీసీ చెక్‌లిస్ట్ రూపొందించింది.
ALSO READ:
ఐఎస్‌బీకి అరుదైన ఘనత, ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా మరోసారి ఏఎంబీఏ గుర్తింపు
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అరుదైన ఘనత సాధించింది. అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ(ఏఎంబీఏ) నుంచి మరోసారి గుర్తింపు(రీ అక్రిడేషన్) పొందినట్లు ఐఎస్‌బీ తెలిపింది. దీంతో దేశంలోని అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఐఎస్‌బీ సత్తా చాటింది. ఈ సందర్భంగా ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ ఆచార్య రామభద్రన్ తిరుమలై మాట్లాడుతూ.. తాము అందిస్తున్న ప్రపంచస్థాయి బోధన, లోతైన పరిశోధన, నిపుణులైన అధ్యాపక వర్గం, అంతర్జాతీయ స్థాయి వసతులు సంస్థను ఉన్నతంగా నిలుపుతున్నాయన్నారు. ఈ క్రమంలో తమ సంస్థకు వరుసగా గుర్తింపు లభిస్తోందని చెప్పారు. ఐఎస్‌బీ.. ఏఎంబీఏతో పాటు ఈఎంఎఫ్‌డీ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ సిస్టమ్ (ఈక్విస్), ఆసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్ కాలేజియెట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఏఏసీఎస్‌బీ) నుంచి గుర్తింపులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ & సేఫ్టీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు, కనీస అర్హత ఇంటర్
నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, సేఫ్టీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెంకట్‌రెడ్డి అక్టోబరు 8న ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయ్యాక పరిశ్రమలు, ఎయిర్‌పోర్టు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వేస్ సంస్థలలో అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 18 లోపు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 97014 96748 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..