CLAT 2021 Results: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (Common Law Admission Test- CLAT)- 2021 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది. క్లాట్ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. క్లాట్- 2021 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30న మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. క్లాట్ పరీక్షకు హాజరైన వారు.. consortiumofnlus.ac.in/clat-2021/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ దేశవ్యాప్తంగా జూలై 23వ తేదీన క్లాట్ పరీక్షను నిర్వహించింది. దీని ద్వారా గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 82 నగరాల్లోని 147 పరీక్ష కేంద్రాల్లో క్లాట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు గానూ మొత్తం 70,277 మంది రిజిస్ట్రర్ చేసుకోగా.. 66,887 మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 62,106 మంది పరీక్షలకు హాజరయ్యారు.
'కీ'పై అభ్యంతరాలు..
క్లాట్ ఎగ్జామినేషన్ ఫైనల్ 'కీ'ని జూలై 27వ తేదీన విడుదల చేశారు. ఈ 'కీ'పై పలు అభ్యంతరాలు వెల్లడయ్యాయి. క్లాట్ పీజీ ఎగ్జామ్ 'కీ'లో మొత్తం 120 ప్రశ్నలు ఉండగా.. 11 ప్రశ్నలపై 24 అభ్యంతరాలు వచ్చాయి. ఇక క్లాట్ యూజీ ఎగ్జామ్ 'కీ'లో 61 ప్రశ్నలకు సంబంధించి దాదాపు 1026 అభ్యంతరాలు వెల్లడయ్యాయి.
మార్కులు తెలుసుకోండిలా..
1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in ను క్లిక్ చేయాలి.
2. క్లాట్ 2021 డిటైల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. మొబైల్ నంబరు, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.
4. లాగిన్ అయ్యాక స్క్రీన్ మీద క్లాట్ 2021 స్కోర్ కార్డు కనిపిస్తుంది.
5. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆగస్టు 1న సీట్లు కేటాయింపు..
క్లాట్ ద్వారా సీటు పొందాలనుకున్న అభ్యర్థులు రూ.50000 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను ఆగస్టు 1వ తేదీన విడుదల చేస్తుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు.. తమ సీట్లను ఆగస్టు 5వ తేదీ లోగా కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్లను కన్ఫామ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఎన్ఎల్‌యూ (consortiumofnlus.ac.in ) వెబ్ సైట్‌కు వెళ్లి అందులో యాక్సెప్ట్ లేదా లాక్ ద సీట్ అనే ఆప్షన్ ఎంచుకున్నాక.. డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. దీంతో సీట్ కన్ఫామ్ అవుతుంది. ఇక రెండో దశ సీట్ల కేటాయింపు లిస్టును ఆగస్టు 9వ తేదీన, మూడో అలాట్ మెంట్ లిస్టును ఆగస్టు 13న విడుదల చేయనుంది.
కాగా, గతేడాది క్లాట్- 2020 పరీక్షకు మొత్తం 75,183 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 68,833 మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 86.20 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.