దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న క్లాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 17న రాత్రి 11.59 గంటలలోపు ప్రవేశ ప్రాధాన్యాలను (అడ్మిషన్ ప్రిఫరెన్సెస్) నమోదుచేయాల్సి ఉంటుంది. 


ప్రాధాన్యాలు, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..


➥ క్లాట్-2023 వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి- https://consortiumofnlus.ac.in/clat-2023/


➥ అక్కడ 'Update Preferences' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


➥ కావాల్సిన ప్రాధాన్యాలను నమోదుచేయాలి. 


➥  క్లాట్-2023 అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. 


క్లాట్-2023 అడ్మిట్‌కార్డు కోసం క్లిక్ చేయండి..


క్లాట్-2023 ప్రవేశపరీక్ష ద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా. దరఖాస్తుకు చివరితేది నవంబరు 13తో ముగియగా.. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.


✸ కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాలు


కోర్సులు..


✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)


అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.


✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)


అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కోర్సు వ్యవధి: ఏడాది.


క్లాట్‌ పరీక్ష విధానం..


క్లాట్ యూజీ:


✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 

✪ క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం  (28–32) ప్రశ్నలు వస్తాయి. 


పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:


✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.