AP 10TH RESULTS 2023: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అమరావతిలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలో ఫలితాలను చూడొచ్చు. 
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించారు. గతేడాది తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా లీక్ సమస్య లేకుండా ఆదేశాలు జారీ చేశారు. 


6,64,152 మంది రాసిన పదో తరగతి పరీక్ష పేపర్‌లను ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఆలంటి తప్పులకు అవకాశం లేకుండా చూసుకుంది. వాల్యుయేషన్ పక్కగా నిర్వహించామని చెబుతోంది. 


2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. 


గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్‌ పెరిగింది. అది 3.47 శాతం గా ఉంది. 


జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్‌ పర్సంటేజ్‌ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్‌ 60.39శాతం. 


ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 938 స్కూల్స్‌ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.


గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్‌ ఉంటే...  2,95,807 మంది బాలికలు ఉన్నారు. 


 పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి


ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
అక్కడ హోమ్‌ పేజ్‌లో ఏపీ 10Th రిజల్ట్స్‌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. 
వెంటనే వేరే పాపప్‌ ఓపెన్ అవుతుంది. 
అందులో మీ పదోతరగతి హాల్‌ టికెట్ నెంబర్‌్ టైప్ చేయాలి. 
తర్వాత కింద ఉన్న సబ్‌మిట్‌ బటన్ ప్రెస్‌ చేస్తే రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది. 
ఆ రిజల్ట్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 


ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. బాగా రాశామన్న నమ్మకం ఉన్న వాళ్లు రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని సూచించారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 


రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ తర్వాత కూడా ఉత్తీర్ణత సాధించలేకపోతే... సప్లిమెంటరీకి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మే 17వ తేదీ లోపు సప్లిమెంటరీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.