SSC Exams 2022 : పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు హాల్ టికెట్ పై ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యాకేంద్రం నుంచి పరీక్ష కేంద్రానికి, తిరుగు ప్రయాణం ఆర్టీసీ బస్ లలో ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొంది. ఇందుకు విద్యార్థులు హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. పదో పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  బస్సు పాస్ లేని విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఈ సదుపాయం కల్పించనున్నారు. 



ఆర్టీసీ బస్సుల్లో ఉచితం 


ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,780 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పరీక్షలు ఉన్న రోజుల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. 



విద్యార్థులకు సమాచారం అందించాలని ఆదేశం 


ఈ ఉచిత ప్రయాణం పరీక్షలు నిర్వహించి తేదీల్లో మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వం పబ్లిక్ హాలిడే, సెలవు ప్రకటించిన రోజుల్లో కూడా పరీక్షలు ఉంటే విద్యార్థులకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తారు. ఈ మేరకు సంబంధిత డిపోల మేనేజర్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి విద్యార్థులకు సరిపడే సంఖ్యలో బస్సులు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.  


పదో పరీక్షల తేదీలు ఇవే



  • ఏప్రిల్‌ 27వ తేదీ - తెలుగు

  • ఏప్రిల్‌ 28వ తేదీ - సెకండ్‌ లాంగ్వేజ్‌

  • ఏప్రిల్‌ 29వ తేదీ - ఇంగ్లిష్‌

  • మే 2వ తేదీ -  గణితం

  • మే 4వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-1

  • మే 5వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-2

  • మే 6వ తేదీ  -  సోషల్