AP Schools Half Days : ఈ ఏడాది మార్చి నెల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. భగ భగ మండుతూ నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటికే తెలంగాణలో ఉదయం 11.30 వరకే పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఏపీ విద్యాశాఖ ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఒకటి నుంచి తొమ్మిదో తరగతులకు ఒంటి పూట బడులు(Half Days) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 07.30 నుంచి 11.30 వరకు తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం(Midday Meal) పెట్టి విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఏప్రిల్ 27 నుంచి పదో పరీక్షలు జరగనున్న కారణంగా వారికి తరగతులు యథావిధిగా జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.  



పదో తరగతి పరీక్షలు


AP SSC Exams : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల(10th Class Exams) షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్‌(Intermediate) పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నారు. అందువల్ల పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, జేఈఈ(JEE) పరీక్షలు కారణంగా పరీక్షల షెడ్యూల్ ను మార్పులు చేశారు. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 


పదో పరీక్షల తేదీలు



  • ఏప్రిల్‌ 27వ తేదీ - తెలుగు

  • ఏప్రిల్‌ 28వ తేదీ - సెకండ్‌ లాంగ్వేజ్‌

  • ఏప్రిల్‌ 29వ తేదీ - ఇంగ్లిష్‌

  • మే 2వ తేదీ -  గణితం

  • మే 4వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-1

  • మే 5వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-2

  • మే 6వ తేదీ  -  సోషల్ 


ఇంటర్ పరీక్షలు


ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు జరుగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసి కొత్త షెడ్యూల్ ప్రకటించారు. ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ మొదటి సంవత్సవరం పరీక్షలు జరగనున్నాయి. మే 7 నుంచి మే 24 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జేఈఈ పరీక్షల కారణంగా పరీక్షల షెడ్యూల్ మార్పులు చేసిన బోర్డు పేర్కొంది.