APBIE: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో సమూల మార్పులు

APBIE: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన సమాాచారాన్ని బోర్డు కళాశాలలకు పంపింది.

Continues below advertisement

Changes in Inter Exam Pattern: ఏపీలోని ఇంటర్ విద్యావిధానంలో ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలోనూ మార్పులు చేసింది. దీనిప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల్లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పులకు సంబంధించి జూనియర్‌ కళాశాలలకు ఇంటర్ బోర్డు సమాచారం పంపింది. ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల స్థాయిలో ఈ ఏడాది పదోతరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్‌ వరకు పొడిగించారు.

Continues below advertisement

సైన్సు గ్రూపుల్లో ఐదు పేపర్లే..

ఇప్పటివరకు మ్యాథమెటిక్స్-ఎ, బి పేపర్లుగా 75 మార్కుల చొప్పున 150 మార్కులకు ఉండగా.. ఇక నుంచి పబ్లిక్‌ పరీక్షల్లో రెండూ కలిపి ఒక్క పేపర్‌గానే ఉంటుంది. మార్కులు సైతం వందకు కుదించారు. వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఒక్క పేపర్‌గా 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు 60 మార్కుల చొప్పున ఉండగా.. వీటిని 85 మార్కులకు పెంచారు. ప్రథమ సంవత్సరంలో 15 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులు కలిపి మొత్తం 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. 

బైపీసీలోని బోటనీ, జువాలజీ సబ్జెక్టులు రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వనున్నారు. ఇప్పటివరకు వీటిని వేర్వేరుగా నిర్వహించేవారు. ఇక నుంచి దీన్ని జీవశాస్త్రం(Biology)గా పిలుస్తారు. ఇందులో 43 మార్కులకు వృక్ష, 42 మార్కులకు జంతుశాస్త్రం కలిపి 85 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు. 

సీఈసీలోనూ మార్పులు..
సీఈసీ గ్రూపులో కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కుల చొప్పున ఒక పేపర్‌ ఉంటుంది. 

కొనసాగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం..
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 20తో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 19 నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం(Inter Answer Paper Evaluation) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరైన అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. ఈ మూల్యాంకన విధుల్లో ప్రతి సెంటర్‌లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది పాల్గొంటున్నారు. ఇంటర్ బోర్డు ప్రత్యేక  యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్‌లో హాజరు చేసుకోవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 13తో ముగియగా. మార్చి 3 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 15తో ముగిశాయి. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 20తో ముగిశాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించారు.

Continues below advertisement