ఏపీలోని జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభంకానుంది. బోర్డు అనుమతించిన ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని, అందుకు విరుద్ధంగా ఎవరు చేపట్టినా శిక్షార్హులని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎంవీ శేషగిరి బాబు స్పష్టం చేశారు. ఈమేరకు మే 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలు చేపట్టేందుకు మొదటి దశ షెడ్యూల్‌ను విడుదల చేశామని, ఆమేరకు విద్యా సంస్ధలు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలని ఆయన తెలిపారు.


తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మే 15 నుండి దరఖాస్తు అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్‌ 14లోపు సమర్పించాల్సి ఉంటుంది. జూన్‌ 1 నుండి తరగతులు ప్రారంభించనున్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి 10వ తరగతి మార్కుల జాబితాను ఇంటర్నెట్‌ నుండి తీసుకున్న కాపీల ఆధారంగా తీసుకోవచ్చు. పదోతరగతి మార్కుల మెమోలు వచ్చిన తరువాత వాటిని తీసుకోవచ్చు. అన్ని జూనియర్ కళాశాలలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 


రిజర్వేషన్లకు అనుగుణంగానే ప్రవేశాలు...
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే 'రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌' అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఎ  29 శాతం, బీసీ-బి 10 శాతం, బీసీ-సి 1 శాతం, బీసీ-డి 7 శాతం, బీసీ-ఈ 4 శాతం వంతున సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే విభిన్న ప్రతిభావంతులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా విద్యార్ధులకు 5 శాతం, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ల పిల్లలకు 3 శాతం, ఈబీసీలకు 10 శాతం వంతున అడ్మిషన్లలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది.


ప్రవేశ పరీక్షలు పెట్టడానికి వీల్లేదు..
ఇంటర్మీడియట్‌లో చేరగోరే విద్యార్థులకు అడ్మిషన్‌ ఇచ్చే క్రమంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్‌కు బోర్డు నిర్ణయించిన విధంగా అడ్మిషన్లు చేపట్టాలని, సీలింగ్‌ దాటి చేపట్టకూడదు. ఈమేరకు బోర్డు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని శేషగిరి బాబు అన్ని ఇంటర్‌ కళాశాలలకు ఆదేశాలు జారీచేశారు.


Also Read:


ఏపీ ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..