ఏపీలో ఈ ఏడాది పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, కనీసం 18వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.


హిందూ పండుగలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన, ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామాలకు వెళ్లి ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని, పండుగ సందర్భంగా ఇచ్చే సెలవులను కేవలం 6 రోజులు మాత్రమే ఇవ్వడం సరికాదని, ముఖ్యంగా 16న కనుమ పండుగ తర్వాత రోజునే స్కూళ్లకు, కాలేజీలకు రావాలంటే సొంత గ్రామాకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బంది అవుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రావణ్ కుమార్, బాలాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


గతంలో కనీసం 10 రోజుల పాటు సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడు మారిన పరిస్దితుల్లో వాటిని తగ్గించడంపై వారు అభ్యంతరం తెలిపారు. ఏపీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయసంఘాలు తాజాగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సంక్రాంతి సెలవుల చర్చ వచ్చింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు సంక్రాంతి సెలవులు పెంచాలని ఆయన్ను కోరాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మేరకు 11 నుంచి 16 వరకూ కాకుండా 18 వరకూ వీటిని పెంచాలని కోరాయి. దీనిపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.


రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ఈనెల 18వరకు పొడిగించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించారని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్రోపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. జనవరి 11 నుంచి 16 వరకు పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 17న పునః ప్రారంభం కావాల్సి ఉండగా.. దీన్ని 18 వరకు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.


ముందు ప్రకటించిన షెడ్యూలు ఇదే..


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో సంక్రాంతి సెలవుల గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. ఏపీలోని జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


తెలంగాణలో ఇలా..


ఇక తెలంగాణలో 5 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలకు ఇవే సెలవులు దినాలు ఉండే అవకాశం ఉంది. 


జనవరి నెల‌లో భారీగా సెలవులు రానున్నాయి. సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న‌ ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.


➥ ఇక జనవరి నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.


➥ ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. 


➥ ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.


➥ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన‌ గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.


➥ జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..