రోజూ కూలికి వెళ్తూ పీహెచ్‌డీ పూర్తి చేసిన భారతి విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఆమెకు రెండు ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ గౌతమి ల్యాండ్ పట్టాను భారతికి అందజేశారు. 


అనంతపురం జిల్లా నాగులగుడ్డం గ్రామానికి చెందిన భారతి దినసరి కూలి. కూలి పనులకు వెళ్తూనే శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు. ఎంతో స్ఫూర్తి దాయకమైన ఆమె స్టోరీ జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. 


పేదరికంలో ఉంటూనే ఉన్నత విద్యలో ఆమె సాధించిన ఘనత ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె కథను చూసిన వాళ్లు విన్న వాళ్లు చలించిపోయారు. ఆమెకు సాయం చేయడనికి ముందుకు వచ్చారు. ఎవరికి తోచినవిధంగా వాళ్లు హెల్ప్ చేశారు. సోషల్‌ మీడియాలో ఆమె ఓ స్టార్ అయిపోయారు. 


పేదలందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం భారతి విషయంలో ఏం చేసిందని నెటిజన్లు, ప్రతిపక్షాలు, నిలదీశాయి. ఇన్నాళ్లకు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది. ఆమెకు రెండు ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమెకు ఆ పట్టాలను అందజేశారు జిల్లా ఉన్నతాధికారులు. 


ఉద్యోగం విషయంలో మాత్రం పూర్తి స్థాయి భరోసా లభించలేదు. ఏదైనా జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా అవకాశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. కచ్చితంగా ఇస్తామని మాత్రం చెప్పడం లేదు.