AP EAPCET 2026 Results | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో రాకపోవడంతో, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ ఫలితాల విడుదలను వాయిదా వేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎప్‌సెట్ ఫలితాలను గురువారం (జులై 2) నాడు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం మే 12 నుండి 20 వరకు ఈ ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎప్‌సెట్ పరీక్షకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఈ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే, ఎప్‌సెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఏ విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, అలాగే సీబీఎస్‌ఈ (CBSE) రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు అధికారులు వేచి చూడటంతోనే ఫలితాల విడుదల ఆలస్యమైంది.
