Andhra Pradesh Fee Reimbursement | అమరావతి: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం  అందించింది. విద్యార్థుల ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం కూటమి ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేస్తామని ఏపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.788 కోట్లు చెల్లించామని విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని, దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దు

ఫీజు చెల్లింపుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విద్యా సంస్థలకు సూచించారు. బకాయిలను దశలవారీగా చెల్లించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కనుక విద్యా సంస్థలు ఫీజుల కోసం ఎలాంటి బలవంతపు వసూళ్లను చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. 

రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు

తరగతి గదులకు హాజరు కాకుండా నిరోధించడం, హాల్ టిక్కెట్లను నిలిపివేయడం, పరీక్షలకు హాజరు కాకుండా నిరాకరించడం లాంటి చర్యలు చట్టవిరుద్ధం, ఆమోదయోగ్యం కాదని సూచించారు. అందరు వైస్ ఛాన్సలర్లు తమ అధికార పరిధిలోని అన్ని అనుబంధ సంస్థలలో ఏపీ ప్రభుత్వ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని, రూల్స్ పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.