BC Gurukul Schools Admissions: వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారి పిల్ల‌ల భ‌విత‌కు పునాది వేసే గురుకులాల ప్ర‌వేశాల‌కు మంచి అవ‌కాశం రానే వ‌చ్చింది. 2025-26 విద్యాసంవ‌త్స‌రానికి 5వ త‌ర‌గ‌తి నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివేందుకు అడ్మిష‌న్ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇది ఉమ్మ‌డి జిల్లాల వారిగా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌గా ఆయా జిల్లాల్లో ఉన్న మ‌హాత్మా జ్యోతిభాపూలే బీసీ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల‌కు ప్ర‌వేశ‌ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.  

Continues below advertisement


ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో అవ‌కాశం ఇలా...


మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వతరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు." గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీలకుగాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం" అని అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ టి.నిషాంతి తెలిపారు. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా ప్రాతిప‌దిక‌న ఈ ప్ర‌వేశాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు.


డాక్టర్ బీఆర్ అంబేధ్కర్ కోనసీమ జిల్లాలోని జిల్లాలోని 2 గురుకుల పాఠశాలలో అమలాపురం (ఫిషర్‌మ్యాన్ (బాలురు), రామచంద్రపురం (బాలికలు), తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం (బాలికలు), అనపర్తి (బాలురు), కాకినాడ జిల్లాలోని పెద్దాపురం (బాలురు), పిఠాపురం (బాలికలు), తుని (బాలురు), కరప (బాలురు) బీసీ గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీలకుగాను ఈ ప్ర‌వేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు జేసీ వెల్ల‌డించారు. 


ఈ నెల 7నే ప్ర‌వేశ అర్హ‌త ప‌రీక్ష‌..
 
బీసీ సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తి నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చేరేందుకు ఈనెల 7న ప్ర‌వేశ అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.  ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా మిగిలిన సీట్లను భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఇప్ప‌టికే జ‌రిగిన ప్ర‌వేశ ప‌రీక్ష‌లో మెరిట్ సాధించిన విద్యార్థులు తాము ఎంచుకున్న గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాలు పోందారు. మిగిలిన సీట్ల‌కుగాను 7న నిర్వ‌హిస్తున్న ప్ర‌వేశ అర్హ‌త ప‌రీక్ష ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. 


ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిలో ప‌రీక్ష కేంద్రాలు ఇవే.. 


ఈ ప్రవేశ పరీక్షలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాఠశాలలకుగాను అమలాపురం రూరల్ మండలం సమనస గురుకుల‌ పాఠశాలలో నిర్వ‌హించ‌నున్నారు. తూర్పుగోదావరి జిల్లా పాఠశాలలకుగాను రాజమహేంద్రవరంలోని బొమ్మూరు గురుకుల పాఠశాలలోను, కాకినాడ జిల్లా పాఠశాలలకుగాను పెద్దాపురం గురుకుల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.  అర్హులైన అభ్యర్థులు ఆయా గురుకుల పాఠశాలలోని సంబంధింత ప్రిన్సిపాల్స్ ను, ఆయా పాఠశాలలోని ఆఫీస్ కార్యాలయాలను సంప్రదించాలని అంబేధ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి  తెలిపారు.