IPASE May 2024 Schedule: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరుగనున్నాయి.
ఇక ఇంటర్నల్ పరీక్షలకు సంబంధించి.. విద్యార్థులకు జూన్ 6న నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్ 7న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షల షెడ్యూలుతోపాటు ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షల తేదీలను కూడా ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల విషయానికొస్తే.. మే 1 నుంచి 4 వరకు జరుగుతాయి. ఇవి కూడా రెండు విడతలుగా ఉంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి.
IPASE May 2024 - TIME TABLE (English Version)
IPASE May 2024 - TIME TABLE (Telugu Version)
FIRST YEAR VOCATIONAL TIME TABLE
SECOND YEAR VOCATIONAL TIME TABLE
ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం..
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంకాగా.. మొదట ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పించారు. అయితే ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు అధికారులు పొడిగించారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు రాయదల్చినవారు రూ.550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఫీజు రూ.550తోపాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాలని బోర్డు పేర్కొంది. అదేవిధంగా బ్రిడ్జికోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాలని సూచించింది. ఇక ప్రాక్టికల్స్ పరీక్ష ఫీజును రూ.250గా నిర్ణయించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరుకావాల్సినవారు ఈ మేరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఇక జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌కు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 30 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం..
ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 24తో ముగియాల్సి ఉంది.. అయితే ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ద్వారా మరోసారి మార్కుల మూల్యాంకనం, రీవెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రాల స్కానింగ్ కాపీలు, జవాబుపత్రాల వెరిఫికేషన్ కోరవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు (AP Inter Results) సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.