AP Inter Exam Postponed : ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అసని తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉన్న కారణంగా రేపు జరగాల్సిన పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. అసని తుపాను ప్రభావం వల్ల రేపటి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను 25వ తేదీన నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను దిశను మార్చుకుంది. ఉత్తర కోస్తా-ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను దిశ మార్చుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు పయనిస్తుంది. బుధవారం సాయంత్రం వరకు మచిలీపట్నం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.


ఏపీపై అసమి తుపాను ప్రభావం


దక్షిణ అండమాన్ సముంద్ర, బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరికొన్ని గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుంది. అసనీ తుపాను కాకినాడకు 210 కి.మీ, విశాఖపట్నానికి 310 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అసని తుపాను వాయువ్య దిశగా కదులుతూ మే 11 ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా రానుందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రంలో అలజడి అధికం కావడంతో మే 12వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చిరించింది.


అనంతరం బలహీనపడి దిశ మార్చుకుని ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్లే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో తుపాను బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సైతం రేపటి వరకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అసనీ తుపాను (Cyclone Asani) ప్రభావం నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


దిశ మార్చుకున్న అసని


అసని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలో తూర్పుగోదావరి, విజయవాడ, విశాఖపట్టణం, శ్రీకాకుళంలోనే గాక ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గాలులు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. భారీగా వీస్తున్న ఈదురు గాలులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అసని దిశ మార్చుకుని పయనిస్తుంది. ఉత్తర కోస్తా-ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దిశ మార్చుకుంది. రేపు సాయంత్రంలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తుంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి తిరిగి విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.