ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషల వినియోగాన్ని ప్రోత్సహించాలని యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను కోరారు. విద్యార్థులు ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుతున్నప్పటికీ వారికి మాతృభాషలో పరీక్షరాసేందుకు అనుమతివ్వాలని సూచించారు. అలాగే వివిధ భాషల్లో ఉన్న ప్రామాణిక పుస్తకాలను మాతృభాషల్లోకి అనువదించి, యూనివర్సిటీల్లో బోధన, అభ్యాస ప్రక్రియల్లో స్థానికభాషను ఉపయోగించాలని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్‌ 19) ఆయన అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు లేఖ రాశారు.


‘‘విద్యావ్యవస్థలో భారతీయ భాషలను ప్రోత్సహించడం, వాటిని క్రమం తప్పకుండా ఉపయోగించేలా చేయడం జాతీయ విద్యావిధానం-2020లో ముఖ్యమైన విషయం. మాతృ/స్థానిక భాషల్లో బోధనా ప్రాధాన్యం గురించి ఈ విధానం ప్రత్యేకంగా చెబుతోంది. బోధన, అభ్యాసం, మూల్యాంకన కార్యక్రమాలను ఒకసారి స్థానిక భాషల్లో మొదలు పెడితే విద్యార్థులు క్రమంగా అటువైపు మళ్లడం పెరుగుతుంది. అది మంచి ఫలితాలకూ దారితీస్తుంది.


పాఠ్యపుస్తకాల తయారీ, మాతృ/స్థానిక భాషల్లో బోధనా, అభ్యాస ప్రక్రియకు మద్దతు ఇవ్వడంలో ఉన్నత విద్యాసంస్థలది కీలకపాత్ర. అందువల్ల ఆ ప్రయత్నాలను బలోపేతంచేసి, మాతృభాషల్లో పాఠ్యపుస్తకాలు రాసే ప్రక్రియకు ప్రోత్సాహం అందించాలి. ఈ నేపథ్యంలో కమిషన్‌ రెండు అంశాలపై ప్రధానంగా విజ్ఞప్తి చేస్తోంది. అందులో ఒకటి విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నప్పటికీ వారు స్థానిక భాషల్లో పరీక్షలు రాయడానికి అనుమతివ్వాలి. ఇక రెండోది అసలు రచనలను (ఒరిజినల్‌ రైటింగ్స్‌) స్థానిక భాషల్లోకి అనువదించడాన్ని ప్రోత్సహించాలి. స్థానిక భాషల్లో పుస్తకాలను ముద్రించగలిగే స్థానిక ప్రచురణకర్తలను గుర్తించాలి. స్టడీమెటీరియల్‌ను స్థానిక భాషల్లోకి తేవడంపై చర్చించి, అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకోవాలి’’ అని యూజీసీ ఛైర్మన్‌ తన లేఖలో ఉపకులపతులకు సూచనలు జారీచేశారు.