తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి.
తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తెరుచుకోనున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు స్కూల్‌కు వెళ్లనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు.
తెలంగాణలో పాఠశలల సెలవులు పొడిగించారని వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది. విద్యాశాఖ సెక్రటరీ మాట్లాడుతూ... వేసవి సెలవులను 19 వరకు పొడిగించారని ఫేక్ న్యూస్ తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజం కాదన్నారు. సెలవులను పొడిగించలేదని తేల్చి చెప్పారు. సోషల్‌మీడియాలో ఫేక్ సర్క్యులర్ వైరల్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు.
గతేడాది 1-8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన సర్కారు ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరించనుంది. అంతేకాకుండా విద్యార్థులపై చదువు భారం లేకుండా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే నిర్వహిస్తారు. ఆ రోజు ఎలాంటి చదువుల ఒత్తిడి లేకుండా ఆటలు ఆడిపిస్తారు. సిలబస్‌లో లేని అంశాలు, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని కలిగించే కార్యక్రమాలు చేపడతారు. ఆధునిక సాంకేతికతపైై జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహిస్తారు.
విద్యార్థులకు టీఎల్‌ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) అందిస్తారు. ఈ సంవత్సరం కూడా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమం అమలు చేస్తారు. ఆధునిక ప్రపంచంతో పోటీ పడేలా చేపట్టాల్సిన కార్యక్రమాలతో ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేసి ఆయా స్కూల్స్‌కు పంపించారు.
తెలంగాణలోని 19,800 టీచర్లకు ట్యాబ్‌లు అందజేయనున్నారు. 2,265 జిల్లా పరిషత్ స్కూళ్లు, 467 మండల వనరుల కేంద్రాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేస్తారు.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేసవి సెలువుల పొడింగుపు లేదని అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ రిజిస్ట్ర అవుతున్న వేళ కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. 17వ తేదీ వరకు ఒంటిపూట బడులే ఉంటాయని పేర్కొంది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు మాత్రమే స్కూల్ ఉంటుందని ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణి చేయనుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ఈ కిట్ల పంపిణీని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.
కిట్‌లో ఏముంటాయి
ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ( ఒక పేజీలో ఇంగ్లీష్ మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్‌లు, వర్క్‌బుక్‌లు, 3జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు)తో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్స్ తెరిచిన ఫస్ట్ డేనే అందించనున్నారు.
"జగనన్న విద్యాకానుక" కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు కూడ పూర్తి చేశారు. ప్రతి విద్యార్థికి దాదాపు రూ.2,400ల విలువైన విద్యా కానుక పంపిణి చేస్తున్నట్లుగా సర్కార్ చెబుతోంది.