CAT 2023 Exam: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామన్ అడ్మిషన్ టెస్ట్ (Common Admission Test - CAT)-2023' ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు ఐఐఎం లక్నో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 26న క్యాట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు మూడు విడతలుగా 'CAT - 2023' పరీక్ష జరుగనుంది. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు చివరి సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అక్టోబరు 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష సమయం వరకు అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


దేశంలోని దాదాపు 155 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం సుమారు 3.3 లక్షల మంది క్యాట్ పరీక్షకు హాజరుకానున్నారు. 2022లో 2.55 లక్షలు, 2021లో 2.31 లక్షల మందే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే 31 శాతం దరఖాస్తులు పెరగడం విశేషం.ఈసారి మొత్తం అభ్యర్థుల్లో 1.17 లక్షల మంది అమ్మాయిలున్నారు. 


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥ క్యాట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్‌కార్డు ప్రింట్ తీసుకొని, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.


➥ పరీక్షకు హాజరయ్యేవారు మొబైల్ ఫోన్లు, చేతి వాచీలు, కాలిక్యులేటర్, కెమెరా, పెన్సిల్ బాక్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్టు తీసుకెళ్లకూడదు. 


➥ టోపీలు, జాకెట్స్, బూట్లు, ఫుల్ హ్యాండ్ దుస్తులు, ఆభరణాలు ధరించి వెళ్లకూడదు.


➥ దివ్యాంగులు అవసరమైన మెడికల్ సర్టిఫికేట్లు, IIMCAT జారీచేసిన 'scribe an affidavit' తీసుకెళ్లాల్సి ఉంటుంది.


➥ పరీక్షకు సంబంధించిన మరిన్ని సూచనలను అడ్మిట్‌కార్డులో చూడవచ్చు.  


పరీక్ష విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 


➥ సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ -  24 ప్రశ్నలు – 72 మార్కులు.


➥ సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు


➥ సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.


ఐఐఎం క్యాంపస్‌లు ఇవే.. 
క్యాట్ 2023 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. 



ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply