తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ విద్య. ఏంటి తెలుగులోనా? నిజమేనా అనుకుంటున్నారా.. అవును నిజమే. ఇక నుంచి మన మాతృ భాషలోనే చదువుకోవచ్చని ఏఐసీటీఈ చెప్పింది. సరే మరి భారతదేశం అంటే ఒక్క భాష కాదు కదా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోటి. ఉత్తర భారతదేశం అయితే ఎక్కువ మందికి హిందీ వచ్చు. సో వాళ్లకి ఎంచక్కా హిందీలో చదువు చెప్పేస్తారు. మరి మన దక్షిణ భారతదేశం పరిస్థితి ఏంటి? మనకసలే రాష్ట్రానికో భాష ఉంది కదా అనుకుంటున్నారా? మీ డౌట్ కరెక్టే. దీని గురించి కూడా ఏఐసీటీఈ ఆలోచించింది. అందుకే ఏ రాష్ట్రానికి తగ్గట్లు ఆ రాష్ట్ర భాషలోనే పాఠాలు నేర్పుతామని చెప్పింది. ఇదంతా కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలవ్వబోతుంది. మరి దీనివల్ల లాభమా? నష్టమా? పదండి చూద్దాం.. 





ఇంజనీరింగ్‌ కోర్సులు ఇకపై ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. 2021-22 విద్యా సంవత్సరం ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దశల వారీగా ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించింది. మొదటి దశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సును బోధించనుంది. 
భాష కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో కోర్సులు అభ్యసిస్తున్నప్పటీ నాలుగేళ్ల పాటు వారికి ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. దీనికి గానూ ఇంజనీరింగ్‌ విభాగంలోని కోర్సులను ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తోంది. మొత్తం 11 భాషల్లోకి కోర్సులను అనువాదం చేస్తోంది. ఇది పూర్తయితే త్వరలో మరిన్ని భాషల్లో ఇంజనీరింగ్ బోధన ప్రారంభం అవుతుంది. 
మాతృ భాషలోనే ఎందుకు? 
ఏఐసీటీఈ గతేడాది ఓ సర్వే నిర్వహించింది. ఇందులో సగం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తాము మాతృభాషలోనే చదవాలనుకుంటున్నామని చెప్పారు. దీంతో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధన గురించి అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్‌ ప్రేమ్‌ విరాట్‌ అధ్యక్షతన కమిటీ వేసింది. ఐఐటీలు (IIT), ఎన్‌ఐటీలు (NIT), ఏఐసీటీఈ అనుబంధ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఎంచుకునేందుకు విద్యార్థులకు ఆప్షన్‌ ఉండాలని ఈ కమిటీ సూచించింది. దీంతో ప్రాంతీయ భాషల్లో విద్యా బోధనకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది.
సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషలో నేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన లాభ, నష్టాలపై విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   
లాభం ఎందుకంటే.. 



  • ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ ఇంగ్లిష్ మీడియంలో చేరిన విద్యార్థులు భాష రాక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్‌లో కాలేజ్ టాప్ వచ్చిన విద్యార్థి ఇంజనీరింగ్‌లో ఫెయిలైన సందర్భాలు కూడా ఉన్నాయి. భాష అర్థం కాకపోవడం, అర్థం అయిన దానిని పరీక్షల్లో సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. తెలుగులోనే బోధన జరగడం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు.

  • మాతృ భాషలో పాఠాలను బోధించడం వల్ల విద్యార్థులు పాఠాలను కంఠస్థం చేయకుండా భావాలను సులువుగా గుర్తుంచుకుంటారు. వారంతట వారే పాఠాలను చదివి అర్థం చేసుకోగలుగుతారు. అలాగే భావనలను కూడా సులువుగా వ్యక్తపరచగలుగుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. 

  • ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది మాతృ భాషను మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. తాజా నిర్ణయం వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ది చెందే అవకాశం ఉంది. 


నష్టం ఎందుకంటే..



  • ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సుల్లో పరిశోధనలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రాక్టికల్ పరిజ్ఞానం అవసరం. ఇలాంటి వాటి కోసం రీసెర్చ్ (Global Research) చేయాలంటే మెటీరియల్స్, ఆర్టికల్స్ లాంటివి ఇంగ్లిష్‌లోనే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. తెలుగులో దొరకడం కష్టం. 

  • మాతృ భాషలో చదువుకోవడం వల్ల ఇంగ్లిష్‌లో నైపుణ్యాలు పెరిగే అవకాశం తక్కువ. దీనివల్ల భవిష్యత్‌లో ఉద్యోగావకాశాల్లో వెనకబడిపోయే ప్రమాదం ఉంది. ఐఐటీ, ఎన్ఐటీ వంటి వాటిలో చదువుకున్న వారిలో చాలా మంది స్థానికంగా ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపరు. ఇలాంటి వారు అంతర్జాతీయ స్థాయి (మల్టీ నేషనల్) కంపెనీలలో పనిచేయడానికి ఇష్టపడతారు. దేశం దాటి వెళితే ఇంగ్లిష్ కచ్చితంగా అవసరం. అలాంటి సందర్భాల్లో భాష అవరోధంగా మారే ప్రమాదం ఉంది. 

  • ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రంలో చదువుకోవాలనుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. 

  • ప్రస్తుతం సాంకేతిక విద్యకు సంబంధించిన టెస్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లిష్ భాషలోనే ఉన్నాయి. వీటిని తర్జుమా చేయాలంటే ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్లు కావాలి. భాషను ట్రాన్స్‌లేట్ చేయడంలో తప్పులు వస్తే పూర్తి అర్థం మారిపోయే ప్రమాదం ఉంది.