Ysrcp Rajya Sabha MP Daughter Arrested In Chennai: హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ కుమార్తెను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. బెసంట్ నగర్‌కు చెందిన సూర్య పెయింటర్‌గా పని చేస్తున్నారు. సోమవారం బెసంట్ నగర్ కళాక్షేత్ర కాలనీ వరదరాజసాలైలో పుట్ పాత్‌పై అతను నిద్రిస్తున్నాడు. ఇదే సమయంలో ఎంపీ బీద మస్తాన్‌రావు (Beeda Masthan Rao) కుమార్తె మాధురి తన స్నేహితురాలితో కలిసి బీఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి పుట్ పాత్‌పై నిద్రిస్తోన్న పెయింటర్‌పై దూసుకెళ్లింది. ఘటన జరిగిన వెంటనే ఆమె అక్కడి నుంచి పరారు కాగా.. ఆమె స్నేహితురాలు అక్కడ గుమికూడి ప్రశ్నించిన స్థానికులతో వాదనకు దిగారు. అయితే, ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన పెయింటర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సీసీ ఫుటేజీ ద్వారా..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి సీసీ ఫుటేజీ ఆధారంగా కారు నడుపుతున్నది వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురిగా గుర్తించారు. ఆమెతో పాటు కారులో మరో మహిళ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మాధురిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అయితే, విషయం తెలుసుకున్న మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సూర్యకు 8 నెలల క్రితమే వివాహమైందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారులోని ఇద్దరు మహిళలు మద్యం సేవించి వాహనం నడిపారని ఆరోపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీఎంఆర్ (బీద మస్తాన్‌రావు) గ్రూప్ పేరిట పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. బీద మస్తాన్‌రావు 2022లో రాజ్యసభ సభ్యుడయ్యారు.