పోలీసులు తన వాహనాన్ని తీసేయమన్నారని మంత్రి పేర్ని నాని పోలీసులపై చిందులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పోలీసుల అందరి వెహికల్స్ అక్కడ ఉన్నాయని తన వాహనాన్నే ఎందుకు తీసేయమంటున్నారని ఆయన కాస్త పరుషమైన పదజాలమే వాడారు. పేర్ని నాని ధాటిగా.. ధీటుగా మాట్లాడగల నోరున్న నేత. వెంటనే పోలీసులు కూడా సర్దుకున్నారు. తమనేదో అన్నారని బాధపడలేదు. మంత్రి గారి కోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేశారు. సామాన్య వ్యక్తి ఇలా ఘాటుగా నిజంగా రూల్స్ మాట్లాడినా వాళ్లకి పోలీస్ ట్రీట్‌మెంట్ వేరే ఉంటుంది. కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలకు మాత్రం అణిగిమణిగి ఉంటుంది. ఇది ఒక్క పేర్ని నాని విషయంలోనే కాదు.. తరచూ ఎక్కడో చోట పోలీసులతో వైఎస్ఆర్‌ఆర్‌సీపీ నేతల అనుచిత ప్రవర్తన వివాదాస్పదం అవుతూనే ఉంది.
https://www.youtube.com/watch?v=eiV4bBixihk&t=22s
మంత్రి సీదిరి అప్పల్రాజు వైద్యుడు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక సీఏ చదువుకున్నామా.. డాక్టర్ చదువుకున్నామా అనే సంస్కారం పెట్టుకోకూడదని చాలా మంది నేతలు నిరూపిస్తూ ఉంటారు. వారిలో అప్పల్రాజు కూడా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి భాష వాడినా పోలీసుల విషయంలో మాత్రం గీత దాటకూడదు. కానీ ఆయన దాటేశారు. విశాఖలో శారదాపీఠం ఆశ్రమం మందు తన అనుచరుల్ని అడ్డుకున్నారని అప్పల్రాజు శివాలెత్తిపోయారు. అమ్మనాబూతులు తిట్టారు. అప్పల్రాజు తిట్టింది కింది స్థాయి పోలీసుల్ని కాదు.. సీఐ స్థాయి అధికారినే. మంత్రి అప్పల్రాజు ఎంత తిట్టినా సీఐ మాత్రం కంట్రోల్ కోల్పోలేదు. వెళ్తే మంత్రి వెళ్లాలి తప్ప అనుచరుల్ని పంపించేది లేదన్నారు. అప్పల్రాజు ఎలా తిట్టారో ఈ వీడియోలో చూడవచ్చు.
https://www.youtube.com/shorts/DF2CN30SqDk
మామూలుగా అయితే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం నేతలు మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టి, మీసాలు తిప్పి, గుడ్డలిప్పదీసి కొడతామని ఘాటుగా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అంతకు ముందు ఈ పనులన్నీ వాళ్లు చేశారు. ఇలా చేసిన వారిలో మహిళా పోలీసు సంఘం నేత కూడా ఉన్నారు. కానీ ఇంత మంత్రి అప్పల్రాజు పోలీసులపై ఇంత దారుణంగా కుటుంబసభ్యుల్నీ తిట్టినా ఎవరూ మాట్లాడలేదు. కనీసం మంత్రిపై కేసు కూడా పెట్టలేదు. అయితే ఇదే అతి పెద్దది కాదు.. ఇది లెటెస్ట్‌ది కాబట్టే ఇలా చెప్పుకున్నాం.
ఇటీవలే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల గొడవలో పోలీసులు తమ పార్టీ వైపు ఉండలేదని చెలరేగిపోయారు. ఉయ్యూరు ఎస్‌ఐని తిట్టాల్సిన విధంగా తిట్టారు. పైగా ఆ ఊళ్లో ఉంచేది లేదని బెదిరించారు. ఈ వీడియో చూసి పాపం పోలీసులు అనుకోని సామాన్య వ్యక్తి లేరు.
https://www.youtube.com/watch?v=f_S_03H0sgU
ఓ పేర్ని నాని.. మరో సీదిరి అప్పల్రాజు.. కాదంటే పార్థసారధినే కదా అనుకుని.. ఎక్కడో కొంత మంది ఉంటారులే అని సర్ది చెప్పుకోవడానికి లేదు. ఎందకుంటే ఊరకో వైసీపీ నేత ఇలా పోలీసులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడలో ఎంపీ నందిగం సురేష్ ... తన మేనల్లుళ్లను పోలీసులు ఆపారాని స్టేషన్‌కి వచ్చి చేసిన రచ్చ కళ్ల ముందు మెదులుతూనే ఉంది.
నెల్లూరు జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్ ఉన్నప్పుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చాలా పద్దతిగా తిట్టారు. ఎవరనుకుంటున్నారు..? ఏమనుకుంటున్నావు..? మీ డీజీపీ కాపాడుతాడనుకుంటున్నావా. ? ఉన్నన్ని రోజులూ మంచిగా ఉండు అంతే కానీ తమాషాలు పడొద్దు అని ఘాటుగానే మీడియా ముందే వార్నింగ్ ఇచ్చారు. తర్వాత భాస్కర్ భూషణ్ ఆయన చెప్పినట్లే పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూనే ఉన్నాయి. తాడికొండ ఎమ్మెల్యే ఓ సీఐని పట్టుకుని నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావని తిట్టినా ఎవరూ స్పందించలేదు.
పై స్థాయిలో ఇంత అలుసు ఇచ్చారేమో కానీ కింది స్థాయిలోనూ చెలరేగిపోయారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఓ రౌడీషీటర్ పోలీసులపైనే దాడి చేశారు.. తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఓ వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారుడు చొక్కా విప్పి వీరంగం సృష్టించారు.. చివరికి శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల అధికారిక వాహనం మీద మద్యం , మంచింగ్ పెట్టుకుని మందు కొడతాం.. బండి మాదే.. ప్రభుత్వం మాదే అని వాదించేదాకా వెళ్లిపోయారు. కానీ ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు.
https://www.youtube.com/watch?v=ENkBa9tzkxw
ఏపీలో పోలీసుల పని తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. బాధితుల్నే వేధిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ విశ్లేషణ అంతా ఇక్కడ ఎందుకు కానీ.. పోలీసులు తమ గౌరవాన్ని తాము కాపాడుకోలేకపోతున్నానేది మాత్రం వరుసగా వారిపై జరుగుతున్న దౌర్జన్యాలు.. ఎదుర్కొంటున్న బూతుపురణాలే సాక్ష్యం. పోలీసులు అంటే సమాజంలో ఓ ఇమేజ్ ఉంది. దాన్ని కాపాడుకోవాల్సింది వాళ్లే. ఇష్టమైన వాళ్లు పిత్తినా సువాసనేనన్న సామెతను అన్వయించేసుకుని అధికార పార్టీ నేతలు తిట్టినా పొగడ్తలుగానే భావించి ఇతరులు ప్రశ్నిస్తే.. మమ్మల్నే ప్రశ్నిస్తారా అని మీసాలు తిప్పితే ప్రజల్లో కూడా చులకన బావం ఏర్పడుతుంది. అలా ఏర్పడేది వ్యక్తుల మీద కాదు.. పవిత్రమైన పోలీసు వ్యవస్థ మీద. ఈ విషయం పోలీసులు తెలుసుకుంటారా ?