పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 


అయితే ఈ సినిమా విషయంలో తనకు సాయం కావాలంటూ దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అడిగారు. సాంకేతికంగా తమ సినిమాకి సాయం చేయమని ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో.. 'డియర్ ఆనంద్ మహీంద్రా సార్.. మీరు ఎన్నో విషయాల్లో నన్ను ఇన్స్పైర్ చేశారు. ప్రస్తుతం నేను అత్యంత భారీ బడ్జెట్‌తో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికలతో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా 'ప్రాజెక్ట్ K' రూపొందిస్తున్నాం. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. దీనికోసం స్పెషల్ గా వెహికల్స్ ను తయారు చేయిస్తున్నాం. అవి నేటి సాంకేతికతకు మించి ఉంటాయి. ఈ సినిమాను అనుకున్నట్లుగా తీయగలిగితే.. అది మన దేశానికే గర్వకారణమవుతుంది. మా టీమ్ లో టాలెంటెడ్ వ్యక్తులు ఇంజినీర్లు అత్యుత్తమ డిజైనర్‌లు ఉన్నారు. అయితే, ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది కాబట్టి దీనికి మీ సహకారం కావాలి' అంటూ రాసుకొచ్చారు. 


ఇది చూసిన ఆనంద్ మహీంద్రా.. 'ఫ్యూచర్ మొబిలిటీను ఊహించడంలో మీకు సాయం చేయడానికి మేం నో ఎలా చెప్పగలం..? మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలు మహీంద్రా మీకు సాయం చేస్తారు. ఆయన xuv700ని డెవలప్ చేశారంటూ' చెప్పుకొచ్చారు. దీనికి నాగ్ అశ్విన్ థాంక్స్ చెబుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీ నిపుణుల సాయం కూడా కావాలని ట్వీట్ వేశారు.