Ysrcp Leader Attack On MPDO In Annamayya District: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులు శుక్రవారం దాడికి తెగబడ్డారు. ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఈ ఉదయం దాదాపు 20 మంది అనుచరులతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా.. ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తానని ఎంపీడీవో తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు.. 'మాకే ఎదురు చెబుతావా' అంటూ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. కుర్చీలో నుంచి కింద పడిపోయినా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అధికారిపై దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.


ఎంపీడీవో కన్నీటి పర్యంతం


తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఎంపీడీవో జవహర్‌బాబు కోరారు. తనపై దాడి జరిగిన తీరును మీడియాకు వివరిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 'గది తాళాలు ఇవ్వనందుకే వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి, అతని 20 మంది అనుచరులు నన్ను విచక్షణారహితంగా కొట్టారు. అడ్డుకున్న నా మేనల్లుడిపై కూడా దాడి చేశారు. దాడి తర్వాత అరగంట పాటు కార్యాలయంలోనే ఉన్నాను. ఇవాళ రాత్రిలోగా నన్ను చంపేస్తానని సుదర్శన్ రెడ్డి బెదిరించాడు. అతను చాలా సందర్భాల్లో అనుచరులతో వచ్చి ఎంపీపీ గదిలో మద్యం సేవించేవారు. ఇవాళ ఉదయం గది తాళాలు ఇవ్వలేదని మూకుమ్మడిగా నాపై దాడి చేశారు.' అని తెలిపారు.


Also Read: Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !